పులిచింతల విద్యుత్‌ ప్లాంట్‌ జాతికి అంకితం

9 Sep, 2018 03:12 IST|Sakshi
గ్రిడ్‌ను పరిశీలిస్తున్న సీఎండీ ప్రభాకర్‌రావు

నాలుగో యూనిట్‌ ప్రారంభించిన ట్రాన్స్‌కో–జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 

చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జల విద్యుత్‌ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎండీ దేవుల్లపల్లి ప్రభాకర్‌రావు జాతికి అంకితం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జలవిద్యుత్‌ ప్లాంట్‌ నాలుగో యూనిట్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యుత్‌ ప్లాంట్‌ వల్ల ప్రభుత్వానికి రూ. 22 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ప్రభుత్వ సహకారం, ఇంజనీర్ల కృషితో ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్‌ పనుల్లో ఇప్పటి వరకు రూ. 486 కోట్ల విలువగల పనులు పూర్తయినట్లు చెప్పారు. మిగతా పనులను కూడా అంచనా వ్యయానికి మించకుండా పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

పులిచింతల ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద నీటి మీద ఆధారపడి 220 మిలియన్‌ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాగర్‌ దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద మరో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 7 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, సీఎండీ (ట్రాన్స్‌కో) జె.శ్రీనివాసరావు, డైరెక్టర్‌ (గ్రిడ్‌) జె. నర్సింహారావు, డైరెక్టర్‌ (ట్రాన్స్‌మిషన్‌) జగత్‌రెడ్డి, డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌ జెన్‌కో) అశోక్‌కుమార్, డైరెక్టర్‌ (ఎన్పీడీసీఎల్‌) గణపతిరావు, డైరెక్టర్‌ (హైడల్‌) వెంకటరాజం, ఎస్‌ఈలు సద్గుణ కుమార్, శ్రీనివాసరెడ్డి, సీఈలు సురేశ్‌కుమార్, రత్నాకర్, ఈఈ అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు