అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం

3 Aug, 2018 11:07 IST|Sakshi
విత్తన ప్రయోగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి తుమ్మల

ఖమ్మం వైద్యవిభాగం : అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 15న కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. గురువారం ‘కంటివెలుగు’పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బందికి నగరంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు

రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇరు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకొని అవసరమైన కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయించుకునేలా చైతన్య పర్చాలన్నారు.

దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడ చేపట్టలేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ నెలాఖరునాటికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయలో భాగంగా జిల్లాలో 4,500 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు.

ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కంటివెలుగుకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘కంటివెలుగు’ ద్వారా జిల్లాలో పరీక్షలు నిర్వహించేందుకు 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

36 బృందాలు శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందిస్తారన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి నగరంలోని మమత జనరల్‌ ఆస్పత్రి, అఖిల కంటి ఆస్పత్రి, జిల్లా ప్రధాన ఆస్పత్రులతో పాటు ఎల్‌వీ ప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మా ట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాలో 31 వైద్య బృందాల ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లాలో 1.15 లక్షల కళ్లజోళ్లతోపాటు మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకునే విధంగా ప్రణాళిక రూపొందిచామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బుడాన్‌ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, నగర మేయర్‌ పాపాలాల్, కమిషనర్‌ సందీప్‌కుమార్‌ఝూ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారులు కొండల్‌రావు, దయానందస్వామి, జిల్లా పరిషత్‌ సీఈఓ నగేష్, ఉమ్మడి జిల్లాల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం

రఘునాథపాలెం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని జింకలతండా వద్ద ఉన్న విత్తన గిడ్డంగిలో నూతనంగా రూ.కోటి 35 లక్షలతో మంజూరైన విత్తన ప్రయోగశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తానికి ఉపయోగపడే ప్రయోగశాలను జింకలతండా వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్, కొండబాల కోటేశ్వరరావు, బుడాన్‌ బేగ్, కోటిలింగం, ఆర్డీఓ పూర్ణచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్‌ శాంత, తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు