పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

23 Mar, 2019 03:06 IST|Sakshi
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆర్‌.కృష్ణయ్య చర్చలు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా, బీసీలకు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆయన నివాసంలో శుక్రవారం ఆర్‌.కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారని, దీనిమూలంగా 1,600 సర్పంచ్‌ పదవులు, 20 వేల వార్డు మెంబర్‌లు బీసీలకు దక్కకుండా పోయాయని వాపోయారు.

రాష్ట్రంలో బీసీలు సమగ్ర సర్వే ప్రకారం 52% ఉంటే 34% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం పట్ల బీసీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగ సవరణకు సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరపాలని మంత్రికి విన్నవించారు. పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్‌ జారీ చేయించవచ్చునన్నారు. దీనికి మంత్రి సానూకులంగా స్పందిస్తూ.. కేసీఆర్‌ నాయకత్వంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు