ఒత్తిడే చిత్తు చేస్తోందా?

20 Nov, 2019 09:10 IST|Sakshi

దుర్భరంగా మారిన రైల్వే లోకోపైలెట్ల విధులు

దక్షిణ మధ్య రైల్వే భద్రతా విభాగంలో 2760 పోస్టులు అవసరం

ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సినవి 1760కి పైనే  

నియామక ప్రక్రియలో  తీవ్ర జాప్యం 

ప్రస్తుతం ఉన్న సిబ్బందిపైనే పెరుగుతున్నపని భారం 

ఏటా 20 శాతానికి పైగా లోకోపైలెట్‌లు ఇతర ఉద్యోగాల్లోకి... 

ఎంఎంటీఎస్‌ దుర్ఘటన వెనుక పనిఒత్తిడే కారణం? 

ప్రయాణికుల భద్రతపై సర్వత్రా చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ట్రైన్‌ నడిపించే లోకోపైలెట్‌ అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, పనిఒత్తిడి చూస్తే ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అలా అనుకొని తిరిగి వెళ్లిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఒకవైపు పని భారం ఉంటే మరోవైపు సిగ్నల్స్‌ కనిపెట్టడం, కాషన్‌ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడంతో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. విధి నిర్వహణలో రెప్పపాటు ఏమరుపాటుగా ఉన్నా కాచిగూడ స్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ రైలు హంద్రీ ఇంటర్‌సిటీని ఢీకొనడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఎంఎంటీఎస్‌ లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌ను ఇటీవల హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు బదిలీ చేశారు. కుటుంబ అవసరాల దృష్ట్యా అక్కడికి వెళ్లడం అతనికి ఇష్టం లేదు. ఒకవైపు పనిభారం, మరోవైపు బదిలీ అంశంతో  ప్రమాదానికి ముందు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. సరిగ్గా సిగ్నల్‌ గమనించలేకపోయాడు.

దురదృష్టవశాత్తు చనిపోయాడు కూడా..
ఇటీవల జరిగిన ఎంఎంటీఎస్‌ ప్రమాదం నేపథ్యంలో కొంతమంది లోకోపైలెట్‌లు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘విధి నిర్వహణలో చంద్రశేఖర్‌ వల్ల క్షమించరాని పొరపాటు జరిగింది. కానీ దానివెనుక ఉన్న కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్క ఎంఎంటీఎస్‌ రైళ్లే కాదు, భద్రతా విభాగంలో సిబ్బంది కొరత లేకుండా ఉంటే ప్రమాదకరమైన పరిస్థితులను అదుపు చేయడం పెద్ద సమస్య కాదు..’ అని ఒక లోకోపైలెట్‌ అభిప్రాయపడ్డారు. 

సిబ్బంది కొరత వల్లే పనిభారం.. 
ప్రయాణికుల రైళ్లు, గూడ్స్‌ రైళ్లు నడపడంలో భద్రతా సిబ్బంది విధి నిర్వహణ ఎంతో కీలకం. వందల కొద్దీ కిలోమీటర్ల దూరం రైళ్లు నడిపే సమయంలో లోకోపైలెట్‌లు  నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. నిద్రాహారాలకు దూరమై యుద్ధం చేసే సైనికుల్లాగే లోకోపైలెట్‌లు సైతం విరామానికి, విశ్రాంతికి నోచక నిర్బంధంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏటా లక్షలాది మంది ప్రయాణికులను, వేల టన్నుల సరుకును ఒక  చోట నుంచి మరో చోటకు రవాణా చేస్తూ రైల్వేకు రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టే  దక్షిణమధ్య రైల్వే లోకోపైలెట్‌లు కనీస అవసరాలను సైతం అందుకోలేకపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా పనిభారం పెరిగి నిత్యం అభద్రత, తీవ్రమైన మానసిక ఒత్తిడి నడుమ ప్రయాణికులను సురక్షితంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తున్నారు.

ప్రయాణికుల భద్రతకు ప్రమాదం ..
సకాలంలో సెలవులు లభించక, విశ్రాంతి దొరక్క గంటల తరబడి విధులు నిర్వహించే  లోకోపైలెట్‌లు సొంత కుటుంబ అవసరాలను సైతం తీర్చలేకపోతున్నారు. ఎంఎంటీఎస్‌ లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌కు ప్రమాదానికి 20 రోజుల ముందే ఒక బాబు పుట్టాడు, మూడేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ప్రమాదం నాటికి భార్యా పిల్లలు ఏలూరులో ఉన్నారు. ఈ క్రమంలో తరచుగా అక్కడికి వెళ్లి రావడానికి అవకాశం లభించకపోవడం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు అతని సహోద్యోగులు తెలిపారు. ఒక్కోసారి దగ్గరి బంధువులో, మిత్రులో చనిపోయినా, మరే ఆపద వచ్చినా వెళ్లి పలకరించలేకపోతున్నట్లు విస్మయం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా గూడ్స్‌ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్‌ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్‌లు (ఇంజన్‌లను ఒక చోట నుంచి మరో చోటకు మార్చే వారు)ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది ప్రమాదకరమే. 

ప్రస్తుత పరిస్థితి ఇదీ..
దక్షిణమధ్య రైల్వేలో భద్రతా విభాగంలో పని చేసే లొకోపైలెట్‌లు, అసిస్టెంట్‌ లోకోపైలెట్‌లు, గార్డులు, పాయింట్స్‌మెన్, షంటర్‌లు తదితర సిబ్బంది సుమారు 9242 మంది పనిచేయవలసి ఉండగా, ప్రస్తుతం 7,482 మంది మాత్రమే ఉన్నారు. 1760  పోస్టులు తక్షణమే భర్తీ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా ఏటేటా పెరుగుతున్న కొత్త రైళ్లు, అదనపు ట్రిప్పుల కారణంగా మరో 1000 పోస్టులు అదనంగా భర్తీ చేయాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు  నియమాక ప్రక్రియలో జాప్యం కూడా ఒక కారణం. లోకోపైలెట్‌లుగా చేరేందుకు రాతపరీక్షలో, మానసికస్థాయి, ఆరోగ్యం వంటి అంశాల్లో ఉత్తీర్ణులైతేనే శిక్షణ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత మరో ఏడాది శిక్షణనిస్తారు. అనంతరం షంటర్‌గా పని అప్పగిస్తారు. ఇలా వివిధ స్థాయిల్లో పని చేసిన తరువాతనే ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు అనుమతినిస్తారు. ఇదంతా జరిగేందుకు కనీసం 5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో బీటెక్, ఎంటెక్‌ వంటి అదనపు అర్హతలు ఉన్న వారు తిరిగి వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలా లొకోపైలెట్‌లుగా అర్హత సాధించిన తిరిగి బయటకు వెళ్తునవారు  20 శాతానికి పైగా ఉండవచ్చునని అంచనా.  

ఒత్తిడి..నిద్రలేమితో చిక్కులు
ఎంఎంటీఎస్‌ దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రత మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి రైళ్లు నడిపే సమయంలో ఎంతో ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతిక్షణం వెంటాడే ఒత్తిడి, నిద్రలేమి కారణంగా చాలామంది రైల్వే విధించిన ఆరోగ్య సూత్రాలకు విరుద్ధమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ఇది ప్రయాణికుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. దీంతో  తరచుగా  హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్‌ పాసింగ్‌ ఎట్‌ డేంజర్‌)సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘రైళ్లు పట్టాలు తప్పే అనేక సందర్భాల్లో  ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిడి వల్లనే తమ ప్రమేయం లేకుండానే సిగ్నళ్లను దాటేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 

సెలవులు కష్టమే..
నిబంధనల ప్రకారం ఒక లోకోపైలెట్‌ ఒక డ్యూటీలో  8 గంటలు మాత్రమే పని చేయాలి. ఆ తరువాత  6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తిరిగి  8 గంటలు పని చేసి మరో 6 గంటలు చొప్పున విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు  విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి  14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున  లోకోపైలెట్‌ లింక్‌ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతికే పరిమితమవుతున్నారు. 16 గంటల విశ్రాంతి పొందవలసిన సమయంలో  12 గంటలకే  అది పరిమితమవుతుంది. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒక రోజు రాత్రి  పూర్తిగా విశ్రాంతి  ఉండాలి.

రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పని చేస్తున్నారు. ‘సెలవులు లభించకపోవడంతో కుటుంబాలతో తగినంత సమయం గడపడం లేదు. పిల్లల ఆలన పాలన, చదువులు, వాళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. క్రమంగా అనుబంధాలకు, ఆత్మీయతలకు దూరమవుతున్నార’ని  ఒక సీనియర్‌ లోకోపైలెట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణంగా ఆరోగ్యరీత్యా రైళ్లు నడిపేందుకు సమర్ధులు (ఫిట్‌నెస్‌లేకపోయినా) కాకపోయినప్పటికీ పని చేయవలసి వస్తుందని పేర్కొన్నారు. లొకోపైలెట్‌ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఏ–1 ఫిట్‌నెస్‌ను కలిగి ఉండాలి. కానీ సిబ్బంది కొరత కారణంగా కొంతకాలంగా దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా