నియమ నిష్టల ‘నెల’వు

30 Jun, 2014 00:45 IST|Sakshi
నియమ నిష్టల ‘నెల’వు

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక దర్శనాన్ని బట్టి సోమవారం నుంచి వారు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చే పవిత్ర మాసంగా రంజాన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇదే మాసంలో దివ్య ఖురాన్ భువిపైకి వచ్చిందని ముస్లింల నమ్మకం. విశ్వ మానవాళికి సేవ చేయడమే ఖురాన్ ప్రభోదించే ప్రధాన అంశం. ఇందులో భాగంగా దైవారాధన, ఉపవాస దీక్షలు, దానధర్మాలు, చెడును త్యజించడం, స్నేహంతో ద్వేషాన్ని గెలవడం, మనోనిగ్రహం పాటించాలనేది ఖురాన్ సారాంశం.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గదర్శకాలు పాటిస్తూ అత్యంత నియమనిష్టలు, ఏకాగ్రతతో కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. ఉపవాస దీక్షలు మానవుల్లో ప్రేమ, కారుణ్యం, మమతానురాగాలను పెంపొందిస్తాయనేది ముస్లింల విశ్వాసం.               
దోమ/షాబాద్/ఘట్‌కేసర్ టౌన్
 

  •  నేటినుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
  •  ప్రేమ, కారుణ్యం, సేవాతత్పరతలే పరమార్థం
  •  గుబాళించనున్న ఆధ్యాత్మిక పరిమళం
  •  ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు
  •  ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

 
రంజాన్ ప్రత్యేకత ఇదీ..
మానవజాతికి దివ్యఖురాన్ గ్రంథాన్ని అందించిన రంజాన్ నెలకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఈ మాసాన్ని ధాన, ధర్మాలు, సేవా కార్యక్రమాల నెలవుగా భావిస్తుంటారు.  వెయ్యి రాత్రుల కన్నా కూడా పవిత్రమైనదిగా భావించే లైలతుల్ ఖద్రపుణ్యరాత్రి ఇదేమాసంలో వస్తుంది. ఈ రంజాన్ మాసంలో రానున్న 27వ రోజున ఉపవాస దీక్షా రాత్రిని పుణ్య రాత్రిగా భావిస్తారు.

దీక్షలు ఇలా..
సహర్.. తెల్లవారుజామున 4:30 గంటలకల్లా తీసుకునే ఆహారాన్ని సహర్ అంటారు. సహర్ అనంతరం ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది.

ఇప్తార్: సూర్యుడు అస్తమించిన పది నిమిషాల లోపు తీసుకునే అల్పాహారాన్ని ఇఫ్తార్ అంటారు.

జకాత్: ధనికులు పేదలకు రంజాన్ వేళల్లో విధిగా పంచే నగదు, ఇతర దానాలను జకాత్‌గా భావిస్తారు. తమ వద్ద కనీసం 52 తులాల వెండి, ఏడున్నర తులాల బంగారం, లేదా దానికి సమానమైన విలువగల డబ్బు ఒక సంవత్సర కాలం పాటు నిల్వ ఉంచుకున్న వారు అందులో 2.5 శాతాన్ని జకాత్ పేరిట దానం చేయాలి. రైతులైతే తాము పండించిన పంటను ఖర్చు పోను మిగతా పంటలపై పదోవంతు ధాన్యాన్ని జకాత్‌గా పంచాలి.
 
తరావీ: తరావీ నమాజ్‌లో 30 అధ్యాయాలుగల ఖురాన్‌ను 26 రోజుల్లో వింటారు. ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి (అఫీజ్)ని చేసి 26వ రోజు రాత్రి సత్కరిస్తారు. తరావీ నమాజ్‌లో ముస్లింలంతా విధిగా పాల్గొంటారు.
 
ఫిత్రా: ఈ పండగనే ఈద్‌పిత్రా అంటారు. ఈ రోజు నమోజ్ ఆచరించే ముందు కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి ఫిత్రా రూపంలో ఒక్కొక్కరి పక్షాన 7.75 కిలోల గోధుమలు గానీ, దానికి సమానమైన నగదు కానీ పేదలకు పంచుతారు.

అత్యంత పవిత్రం
అరబిక్ భాషలో రంజు అనగా కాలడం లేదా శుష్కించడం అని అర్థం. రంజాన్ మాసంలో క ఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందని ముస్లింల నమ్మకం. ఈ దీక్షల ద్వారా కామం, క్రోధం, లోభం, మదం వంటి వాటితో పాటు మోహం అదుపులో ఉండి మనుషులు శాంతి స్వరూపులుగా మారతారనేది వారి విశ్వాసం. అందుకే ఈ దీక్షలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలతో పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు.
 
భౌతిక ప్రయోజనాలు..
ఉపవాస దీక్ష పాటించడం వల్ల ఎన్నో భౌతిక ప్రయోజనాలు సమకూరుతాయి. ముఖ్యంగా ఆరోగ్యంలో సమతుల్యత ఉంటుంది. రక్త ప్రసరన వ్యవస్థ బాగుపడుతుంది. గుండెనొప్పి అవకాశాలు చాలా తక్కువ. 30 రోజుల పాటు దీక్ష పాటించడంతో జీర్ణవ్యవస్థకు రోజుకు సుమారు 14 గంటల పాటు విశ్రాంతి ఇచ్చిన్నట్లు అవుతుంది. దీనికి లివర్, చిన్నపేగులు, జీర్ణాశయాలు తదితర అవయవాలు నూతనోత్తేజం పొందేందుకు అవకాశం కలుగుతుంది. సంవత్సరంలో ఒక్క నెల విధిగా ఉపవాస దీక్షలు పాటించడంతో రోజుకు 14గంటలు ఎలాంటి ఆహార పదార్థాలు, పానీయాలు ముట్టుకోకుండా ఉండడంతో శరీరంలో బాగా వేడి పుట్టి పేగుల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. రక్త ప్రసరణ సాపీగా జరుగుతుంది.  
 
మసీదులకు నూతన కళ

రంజాన్ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని మసీదులు కొత్త కళను సంతరించుకున్నాయి. విద్యుద్దీపాలతో కాంతులు వెదజల్లుతున్నాయి. ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంజాన్ సామగ్రి కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి నెలకొంది. ఇఫ్తార్ కోసం ప్రత్యేకంగా హోటళ్లు ఏర్పట య్యాయి. హలీం, హరీస్ వంటకాల తయారీ కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో దుకాణాలు వెలిశాయి.

మరిన్ని వార్తలు