‘రిటైల్’ దోపిడీ!

22 Oct, 2015 02:07 IST|Sakshi
‘రిటైల్’ దోపిడీ!

సాక్షి, హైదరాబాద్ : ‘అప్పు చేసి పప్పుకూడు తినరా.. ఓ నరుడా..’ అని ఓ సినీ కవి ఎప్పుడో వక్కాణించారు. పప్పన్నం తినాలంటే అప్పు చేయాల్సి వస్తుందని ఆయన ముందుగా ఊహించారేమో..! ప్రస్తుత పరిస్థితి సరిగ్గా అందుకు తగ్గట్టుగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కందిపప్పు ధర రూ.210కి చేరిందన్న వార్తలతో బుధవారం నగరంలో రిటైల్ వ్యాపారులు పప్పుల ధరల్ని అమాంతం పెంచేశారు. ఫస్ట్, సెకెండ్, థర్డ్ క్వాలిటీల పేరుతో విభజించి ఇష్టారీతిన ధరలు నిర్ణయించారు. నాణ్యమై న కందిపప్పు కిలో రూ. 210లు, రెండోరకం రూ. 200, మూడో రకం పప్పు రూ.190ల ప్రకారం వసూలు చేస్తున్నారు.

అయితే... ఇక్కడొక మతలబు ఉంది.  కొందరు రేషన్ షాపు డీలర్లు కందిపప్పును కేజీ రూ.80-100ల ప్రకారం గుట్టుగా రిటైల్ వ్యాపారులకు చేరవేస్తుండటంతో వాటిని నాణ్యమైన పప్పులో కలిపి విక్రయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు వ్యాపారులు 2 క్వింటాళ్ల గ్రేడ్-1 రకం కందిపప్పులో 1 క్వింటాల్ గ్రేడ్-2 పప్పును కలిపి బెస్ట్‌క్వాలిటీ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం.  నిజంగా  పప్పుల ధరల విషయంలో నగరవాసులను నిలువుగా దోచుకుంటున్నది మాత్రం రిటైల్ వర్తకులే. నగర మార్కెట్లో  బుధవారం కందిపప్పు ధర రూ.210లకు  చేరుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
 
ధరల్లో భారీ తేడా
పప్పుల్లో రారాజైన కందిపప్పు..ధర విషయంలో కూడా తన హవాను కొనసాగిస్తుండగా... మిగతా పప్పుల ధరలు కూడా కాస్త అటూ ఇటుగా దీన్నే అనుసరిస్తున్నాయి. సాధారణంగా హోల్‌సేల్ ధరకు రిటైల్ ధరకు మధ్య తేడా రూ.3 నుంచి రూ.4 కు మించదు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.  శనగ, మినప, పెసర పప్పుల ధరల్లో హోల్‌సేల్  ధరలతో పోలిస్తే  రిటైల్ వ్యాపారుల వద్ద కేజీ కి రూ.10-16 తేడా కన్పిస్తోంది.

హోల్‌సేల్‌గానే ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ రిటైల్ వ్యాపారులు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు.  హోల్‌సేల్ మార్కెట్లో మినపప్పు కేజీ రూ.175-180లుండగా రిటైల్‌గా కేజీ రూ.200లు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క మినపప్పేకాదు...పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, పుట్నాలు, పల్లీల ధరల్లో కేజీకి రూ.10-16ల వరకు అదనంగా పిండుకొంటున్నారు. నగరంలో నిత్యం 50-60 టన్నుల కందిపప్పు వినియోగిస్తుండగా, మినపప్పు 60-70 టన్నులు, శనగ, పెసర పప్పులు కూడా రోజుకు 30-35టన్నులు అవసరం అవుతున్నాయి. జనవరిలో  కొత్తపంట చేతికందుతుందని, అప్పటివరకు కందిపప్పు ధర దిగివచ్చే అవకాశం లేదని  దాల్‌మిల్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
 
రైతుబజార్లలోనూ...
నగరంలోని పలు రైతుబ జార్లలో  స్వయం సహాయ క సంఘాలు నడుపుతున్న దుకాణాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. నాణ్యత లో రెండు, మూడు రకాల పప్పుల పేర్లు చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిజానికి వీరు అమ్ముతున్నది రెండు, మూడో రకం కందిపప్పే అయినా...మొదటి రకం పప్పు పేరుతో కేజీ రూ.190-195 ప్రకారం వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రధానమైన ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, వనస్థలిపురం, ఫలక్‌నుమా రైతుబజార్లలో పప్పుల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో లేవు.
 
రేషన్ డీలర్ల నజర్!
కంది పప్పు ధర పెరగడంతో కోటా ఇవ్వాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతి నెల రూపాయికి కిలో బియ్యం తప్ప..కందిపప్పు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. కానీ ఇప్పుడు వారే కంది పప్పు కోసం డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ ఇవ్వాలంటూ పౌరసరఫరాల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ధరలు మామూలుగా ఉన్నప్పుడు ఇండెంట్ పెట్టని కారణంగా గ్రేటర్‌లోని రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో గల ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో కంది పప్పు కొరత ఏర్పడింది.

సివిల్ సప్లయిస్ గోదాముల్లో కంది పప్పు నిల్వలు ఉన్నప్పటికి రేషన్ షాపులకు పూర్తి స్ధాయిలో సరఫరా కాలేదు. నిబంధనల ప్రకారం గత నెల (సెప్టెంబర్) ఆఖరులో అక్టోబర్ కోటా కోసం డీడీ చెల్లించి ఇండెంట్ పెట్టిన షాపులకు మాత్రమే కంది పప్పు విడుదలైంది. అది కూడా మొత్తం ఇండెంట్‌లో 60 నుంచి 75 శాతం మాత్రమే రేషన్ షాపులకు సరఫరా జరిగింది. రేషన్ షాపుల్లో కందిపప్పు రూ.50 కిలో చొప్పున లబ్ధిదారులకు ఇవ్వాలి. బహిరంగ మార్కెట్ రేటు కంటే ఇది ఎంతో తక్కువ.
 
కృత్రిమ కొరత..
బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు ధర రెండింతలు కావడంతో డిమాండ్ పెరిగినట్లయింది. పర్యవసానంగా రేషన్‌షాపుల్లో కృత్రిమ కొరత ఏర్పడింది. డీలర్ల చేతివాటంతో అక్టోబర్ మాసానికి సరఫరా అయినా కంది పప్పు నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలి పోయాయి. బహిరంగ మార్కెట్ వ్యాపారులకు క్వింటాలు రూ.1000 నుంచి 1400 చొప్పున కంది పప్పు నిల్వలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
మిగిలిన కోటా కోసం
గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంత రేషన్ డీలర్ల దృష్టి మిగిలిన కంది పప్పు కోటాపై పడింది. గోదాముల్లో నిల్వలు ఉన్న కారణంగా..అక్టోబర్ నెల పూర్తి స్థాయి కోటా సరఫరా చేయాలని అధికారులపై ఒత్తిళ్లు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు