జాబితా సిద్ధం! | Sakshi
Sakshi News home page

జాబితా సిద్ధం!

Published Thu, Oct 22 2015 2:18 AM

జాబితా సిద్ధం! - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తొలి అంకం పూర్తయింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల జాబితా కొలిక్కి వచ్చింది.  వారం రోజులుగా ఆశావహుల జాబితాను వడపోసిన జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. దసరా కానుకగా నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడత మార్కెట్, దేవాదాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాలని సీఎం ఆదేశించారు.

దీంతో స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సిఫార్సుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పును పూర్తి చేశారు. కొన్నిచోట్ల ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించిన కమిటీలను మాత్రం తొలివిడతలో ప్రకటించేందుకు అనువుగా ప్రభుత్వానికి నివేదించారు. నామినేటెడ్ పదవుల్లో కూడా తొలిసారి రిజర్వేషన్లను వ ర్తింపజేస్తుండడంతో కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల రేసుగుర్రాల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఈ పరిణామం అధికారపార్టీ నేతలకు కొంత ఇష్టంగాను.. కొంతకష్టంగాను పరిణమించింది.
 
పాత, కొత్తలతో తలనొప్పి!
నామినేటెడ్ పదవుల పంపకం ప్రజాప్రతినిధులకు తలనొప్పి కలిగించింది. టీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి రావడంతో ఈ పదవులపై ఆశలుపెట్టుకున్న వారి సంఖ్య గణ నీయంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలకు ఈ పదవులపై కన్నేశారు. అదేసమయంలో ఎన్నికల వేళ.. ఆ తర్వాత కారెక్కిన నాయకులు కూడా పోస్టులను తన్నుకుపోయేందుకు తమవంతు పైరవీలు మొదలు పెట్టారు. ఈ పరిణామం పార్టీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారింది.

ఇబ్రహీంపట్నం, వికారాబాద్, మర్పల్లి, నార్సింగి తదితర మార్కెట్ కమిటీల నియామకాల్లో ఈ సమస్య తలెత్తింది. పాత, కొత్త నాయకులు పట్టుసాధించేందుకు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తుండడంతో పదవుల పంపకం సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేశారు.
 
నార్సింగి, గడ్డిఅన్నారం పెండింగ్
నార్సింగి, గడ్డి అన్నారం మినహా అన్ని వ్యవ సాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఈ రెండింటి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఇదిలావుండగా, కొత్తగా ఏర్పడిన మహేశ్వరం మార్కెట్‌కు కొత్త పాలకవ ర్గానికి సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తడంతో పక్కనపెటినట్లు సమాచారం. కాగా, మార్కెట్ కమిటీల జాబితాను ప్రభుత్వానికి పంపామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత కమిటీలను ఏ క్షణాన్నైనా అధికారికంగా ప్రక టించే అవకాశముందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
Advertisement