నీట్‌గా వచ్చి దోచేస్తాడు!

21 Mar, 2018 02:44 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విలేకరులకు చూపిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌

దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో దొంగతనాలు

15 ఏళ్లలో రూ.12 కోట్లకుపైగా సొత్తు అపహరణ

స్టార్‌ హోటళ్లే టార్గెట్‌గా రెచ్చిపోయిన జయేశ్‌ రావ్‌జీ

‘పార్క్‌ హయత్‌’ కేసులో పట్టుకున్న వెస్ట్‌జోన్‌ పోలీసులు

రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

సాక్షి,, హైదరాబాద్‌: నలభై ఆరేళ్ల వయస్సు.. 27 ఏళ్ల నేర జీవితం.. 15 ఏళ్లుగా స్టార్‌ హోటళ్లే లక్ష్యం.. 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 32 చోరీలు.. రూ.12 కోట్లకు పైగా సొత్తు అపహరణ.. ఐదు కేసుల్లో మాత్రమే అరెస్టు.. మిగిలిన కేసుల్లో వివిధ రాష్ట్రాలకు ఆరేళ్లుగా మోస్ట్‌ వాంటెడ్‌.. బంజారాహిల్స్‌ పరిధిలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ రూమ్‌ నుంచి ఈ నెల 6న రూ.30 లక్షల విలువ చేసే నగలు ఎత్తుకుపోయిన అంతర్రాష్ట్ర గజదొంగ జయేశ్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ నేపథ్యమిది. ఆహార్యం, వాక్చాతుర్యం పెట్టుబడిగా పెట్టి చోరీలు చేస్తూ.. వివిధ రాష్ట్రాల పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతున్న ఈ ఘరానా దొంగను పశ్చిమ మండల పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం   వెల్లడించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావులతో కలసి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  

కొత్త జంటలు, ఫంక్షన్లకు వెళ్లేవారే టార్గెట్‌ 
గుజరాత్‌కు చెందిన జయేశ్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్, ముంబైలలో కొన్ని హోటల్స్‌/ఫుడ్‌ పాయింట్స్‌లో క్యాటరింగ్‌ వర్కర్‌గా పని చేశాడు. అలా వచ్చే ఆదాయం చాలక 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. వీసీపీని ఎత్తుకు పోయి పోలీసులకు చిక్కి ఆథర్‌ రోడ్‌ జైలుకు వెళ్లాడు. అక్కడే ఇతడికి రమేశ్‌ ఛాగ్‌ అనే మరో నేరగాడితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక స్టార్‌ హోటళ్లే లక్ష్యంగా ఇద్దరూ కలిసి కొన్ని నేరాలు చేశారు. ఆపై జయేశ్‌ సొంతంగా ఆ పని ప్రారంభించాడు. ముందుగా ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకునే జయేశ్‌.. అక్కడి ఒక స్టార్‌ హోటల్‌ వద్ద రెక్కీ చేసి.. కొత్తగా పెళ్లైనజంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు. వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం ఉంటుందనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఆ హోటల్‌ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్‌ ఫాస్ట్‌ లిస్ట్‌ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్‌’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు. ఆపై హోటల్‌ లాబీల్లో ఆ జంటలో ఒకరితో మాట కలుపుతాడు. ఇలా ఒకటి రెండుసార్లు తన టార్గెట్‌తో మాట్లాడుతూ హోటల్‌ సిబ్బంది కంటపడతాడు. దీంతో వారు జయేశ్‌ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయి ఉంటాడని భావిస్తారు. ఆపై రిసెప్షన్‌ వద్దకు వెళ్లి ఫలానా రూమ్‌లో తమ వారు బస చేశారని, ఆ ఫ్లోర్‌కు/గది యాక్సెస్‌ కార్డు మర్చిపోయానంటూ వారి నుంచి మరో యాక్సెస్‌ కార్డు తీసుకుని టార్గెట్‌ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు. చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి ముంబైకి పారిపోతుంటాడు. ముంబైలోని బోరేవలి ప్రాంతంలో ఉన్న హిరేన్‌ ఎం.షాకు చోరీ సొత్తు విక్రయిస్తుంటాడు. 

19 నగరాల్లో 32 చోరీలు 
చోరీల ద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు భారీ స్థాయిలో క్రికెట్‌ బెట్టింగ్స్‌ సైతం నిర్వహిస్తుంటాడు. ఈ పంథాలో హైదరాబాద్, విశాఖపట్నం, కోల్‌కతా, ముంబై, బెంగళూరు తదితర 19 నగరాల్లో 32 నేరాలు చేశాడు. ఈ నెల 6న బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచి రూ.30 లక్షల బంగారు నగలు ఎత్తుకుపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ కేఎస్‌ రావు, బంజారాహిల్స్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంవీఎస్‌ కిశోర్‌ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జయేశ్‌ను పట్టుకుని పార్క్‌ హయత్‌ నుంచి చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న నగరాల పోలీసులకు సమాచారం ఇస్తామని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు