ఆర్టీసీ బస్సుల క్యూ..

28 Apr, 2015 01:30 IST|Sakshi

హైదరాబాద్: 'ప్రయాణికులు చెయ్యి ఎత్తితే బస్సు ఆపాలి'... ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం తరచూ ఇచ్చే సూచన ఇది. ప్రయాణికులకు సేవ చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలనేది దీని ఉద్దేశం. కానీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చే మార్గాలపైనే దృష్టి సారించింది. ఇందుకోసం ప్రైవేటు కార్యక్రమాలకు వీలైనన్ని బస్సులు అద్దెకివ్వటానికి ప్రాధాన్యమిస్తోంది. సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభకు పెద్ద పీటవేయడమే దీనికి తాజా నిదర్శనం. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 60 శాతం బస్సులను ఆర్టీసీ ఈ సభకు కేటాయించింది.

సాధారణంగా ఇలాంటి బహిరంగ సభల సమయంలో అదనంగా ఉన్న బస్సులను, రద్దీ తక్కువగా ఉండే మార్గాల్లో తిరిగే బస్సుల్లోంచి కొన్నింటిని కేటాయించటం ఆనవాయితీ. కానీ రద్దీ అధికంగా ఉండే మార్గాల్లోని బస్సులను కూడా అధికారులు  సభకు అద్దెకిచ్చి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. దాదాపు నాలుగు వేల వరకు బస్సులను టీఆర్‌ఎస్ సభకు కేటాయించినట్టు సమాచారం. నిజానికి ఐదు వేలకు మించి బుకింగ్‌లు జరిగినప్పటికీ, ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశముందని సోమవారం ఉదయం కొన్నింటిని రద్దు చేశారు.
 
ఆదాయం రూ.3.55 కోట్లు..
టీఆర్‌ఎస్ సభ రూపంలో ఆర్టీసీ రూ.3.55 కోట్ల ఆదాయాన్ని పొందినట్టు తెలిసింది. దూరాన్ని బట్టి ఆర్టీసీ భారీగా అద్దె వసూలు చేసింది. కొన్ని రూట్లలో ఒక్కో బస్సుకు ఏకంగా రూ.20 వేలకు పైగా అద్దె వసూలు చేసినట్టు తెలిసింది. ఆర్డీనరీ బస్సులకు కూడా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ధర వసూలు చేసినట్టు సమాచారం. ఇక జిల్లాలలో బస్సుల సంఖ్య తగ్గిపోయి సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ నుంచి కొన్ని సిటీ బస్సులను జిల్లాలకు తరలించారు. ఇలా దాదాపు 400 సిటీ బస్సులను పొరుగు జిల్లాలకు పంపినట్టు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 900 బస్సులుంటే 612 బస్సులను టీఆర్‌ఎస్ సభకు కేటాయించారు. దీంతో చాలాచోట్ల బస్సులు లేక ప్రయాణికులు ఆందోళన చేస్తే సిటీ పరిధిలోని రాజేంద్రనగర్ డిపో నుంచి కొన్ని బస్సులను ఆ జిల్లాకు పంపారు.

మరిన్ని వార్తలు