వద్దనుకుంటే రూ.5 లక్షలు

7 Aug, 2017 12:44 IST|Sakshi
వద్దనుకుంటే రూ.5 లక్షలు

ఆర్టీసీ ‘బ్రెడ్‌ విన్నర్‌’ పథకంలో అదనపు ఆర్థిక ప్రయోజనం
ఆగస్టు 4 నుంచి అమలులోకి.. సర్క్యులర్‌ జారీ
గతంలో కేటగిరీల వారీగా.. ఇప్పుడు అందరికీ ఒకేలా
1999 తర్వాత ఆగిన కారుణ్య నియామకాలు, ‘చేయూత’
కొత్త పథకాన్ని 2013 నుంచే వర్తింపజేయాలంటున్న కార్మికులు


సాక్షి, హైదరాబాద్‌: పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చే బ్రెడ్‌ విన్నర్‌ పథకంలో మరో అదనపు లబ్ధి చేకూర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఉద్యోగం అవసరం లేదని కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా రాసిస్తే రూ.5 లక్షల ఆర్థిక చేయూత అందించే వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 4 నుంచి దీన్ని అమలులోకి తెచ్చినట్లు ఆర్టీసీ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది.

గతంలో రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు..
ఇప్పటి వరకు ఉద్యోగం వద్దనుకునే క్లాస్‌–1 కేటగిరీ సిబ్బందికి రూ.1.5 లక్షలు, క్లాస్‌–2కి రూ.1.25 లక్షలు, క్లాస్‌–3 కార్మికులకు రూ.లక్ష వరకు ఆర్థిక చేయూత ఇచ్చేవారు. కానీ.. 1999 తర్వాత కారుణ్య నియామకాల అమలు నిలిచిపోవడంతో ఆర్థిక చేయూత కూడా ఆగిపోయింది. కార్మిక సంఘాల పోరాట ఫలితంగా 2013లో దాన్ని పునరుద్ధరిం చారు. అదే సమ యంలో ఆర్థిక చేయూ త కూడా పెంచాలని డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. కానీ ఇప్పుడు అన్ని కేటగిరీల కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మరి పాతవారి సంగతేంటి?
ఓ పథకాన్ని పునరుద్ధరించినా, రివిజన్‌ చేసినా పాత తేదీ నుంచే అమలులోకి వస్తుంది. కానీ తాజా పథకం విషయంలో దాన్ని పాటించక పోవడాన్ని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక చేయూతను ఆగస్టు నుంచే వర్తింపజేయడం సరికాదని, 2013లో పథకం పునరుద్ధరిం చినందున ఆర్థిక చేయూతనూ అప్పటి నుంచే అమలు చేయాలని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇప్పటికైనా ఈ నిర్ణయం రావటం సంతోషమని ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత రాజిరెడ్డి, టీజేఎంయూ నేత హన్మంతు అన్నారు. కాగా, బ్రెడ్‌ విన్నర్‌ పథకంలో కొన్ని మార్పులు చేయాలని ఎన్‌ఎంయూ కోరుతోంది. గరిష్టంగా కండక్టర్‌ పోస్టునే ఇస్తున్నారని, మెరుగైన విద్యార్హతలున్నవారికి పెద్ద పోస్టులూ ఇచ్చే విధానం కావాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు