మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

26 Jul, 2019 09:45 IST|Sakshi
శస్త్ర చికిత్సతో వెలికి తీసిన కణితిని చూపుతున్న వైద్య బృందం

మూడు గంటల శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు

సాక్షి, గజ్వేల్‌: కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి వైద్యుల బృందం 5కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. గురువారం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిపి కణితిని తొలగించారు. ఆర్‌వీఎం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్‌ జిల్లా మండల కేంద్రమైన ఏదులాబాద్‌ గ్రామానికి చెందిన మండీ లక్ష్మయ్య భార్య సువర్ణ గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది.

ఇటీవల చికిత్స నిమిత్తం ఆమె ఆర్‌వీఎం ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆర్‌వీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వైద్య నిపుణులు డాక్టర్‌.మంజుల, డాక్టర్‌.స్వాతి, డాక్టర్‌.కవితలతో పాటు మత్తు డాక్టర్లు రవీందర్, విజయ్, వంశీ ఇతర వైద్య సిబ్బందితో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి ఆ మహిళ కడుపులోనుంచి 5 కిలోలకు పైగా బరువుగల పెద్ద కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబీకులు, గ్రామస్తులు ఆర్‌వీఎం ఆసుపత్రి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శస్త్రచికిత్స సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. రోగి పూర్తిగా కోలుకుంటుందని వైద్యుల బృందం పేర్కొంది.

 

మరిన్ని వార్తలు