కాంగ్రెస్‌ హయాంలో అంతా అవినీతే

13 May, 2018 12:12 IST|Sakshi
హత్నూర మండలం పన్యాలలో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌

హత్నూర(సంగారెడ్డి) : కాంగ్రెస్‌లో హయాంలో అంతా అవినీతేనని,  కేంద్ర,  రాష్ట్ర మంత్రులు స్కామ్‌లు చేసి జైలుకు వెళ్ళారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ఆయన రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో దేశానికే ఆదర్శంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు.

29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన కేసీఆర్‌కి రావడంతోనే రైతుబంధు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తామని చెప్పడం కాదు దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతుల సంక్షేమం కోసం పాస్‌పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని తేల్చి చెప్పారు. గత పాలనలో లంచం లేనిదే ప్రజలకు పనులు జరగలేదన్నారు.  ప్రస్తుత టీఆర్‌ఎస్‌ పాలనలో నిజాయితితో పనిచేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు రైతులకు పెట్టుబడి చెక్కులు ఇస్తుంటే విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు.

రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 24గంటలు ఉచితకరెంట్‌ ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ది అన్నారు.  కాంగ్రెస్‌ పాలనలో నాయకులు హైదరాబాద్‌లోని క్లబుల్లో ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి చేశారని ఎద్దేవా చేశారు. ఆరునెలల క్రితం జైలులో ఉండివచ్చిన కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు సీఎం సీటు కోసం తహతహలాడుతున్నారని వారి కలలు కలలాగే మిగిలిపోతాయన్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చినా టీఆర్‌ఎస్‌ను కదిలించలేరని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంపై చెక్‌డ్యాంలు కట్టి ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పన్యాల గ్రామానికి రూ. 20 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.

 రైతుబంధు దేశానికే ఆదర్శం : కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం  చెక్కులను వ్యవసాయ సాగు కోసమె వినియోగిస్తామని రైతులచేత కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులను రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హంసీబాయి, మండల రైతుసమన్వసమితి కోఆర్డినేటర్‌ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, నాయకులు అక్బర్, ఎల్లదాస్, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రావు, నీరుడి అశోక్, నరేందర్‌తోపాటు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికా>రులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు