‘చారాణా కోడికి బారాణా మసాల’.. 60 పైసల చెక్‌, అవసరమా?

4 Oct, 2023 10:52 IST|Sakshi

నంగునూరు (సిద్దిపేట): ‘చారాణా కోడికి బారాణా మసాల’ అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంక్‌ చెక్కును చూసి ముక్కున వేలు వేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్‌కు రెండు రోజుల కిందట స్పీడ్‌పోస్ట్‌ ద్వారా కవర్‌ వచ్చింది. అందులో కేరళలోని సౌత్‌ ఇండియా బ్యాంక్‌ త్రిసూర్‌ బ్రాంచ్‌ నుంచి అకౌంట్‌పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్‌ అవాక్కయ్యాడు.

చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో.. తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజులపాటు కష్టపడి విచారిస్తే గతంలో క్రెడిట్‌ కార్డు ద్వారా తీసుకున్న లోన్‌ క్లియరెన్స్‌ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలగా చెక్కు పంపారని తెలుసుకున్నాడు.

రాజశేఖర్‌కు చెల్లించే డబ్బులకంటే చెక్కు ఓచర్, స్పీడ్‌ పోస్ట్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువైనా న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్‌ ఇచ్చిన కంపెనీ వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్‌లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్‌ డైలమాలో పడిపోయారు.

మరిన్ని వార్తలు