-

సాదా బైనామాలకు జూన్ 15 గడువు

3 Jun, 2016 20:41 IST|Sakshi

హైదరాబాద్: తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. సెక్షన్ 22(2) ఏపీరైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ చట్టం మేరకు సాదాబైనామాపై ఉన్న సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విన్నపం మేరకు జూన్, 2, 2014 లోపు తేదీలు ఉన్న సాదాబైనామాలను రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధీకరిచేందుకు సర్కారు అనుమతించింది. క్లెయిమ్‌ల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. క్లెయిమ్‌ల స్వీకరణకు ఆఖరి గడువును జూన్ 15.

ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీని కూడా మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హక్కు బదిలీ, కేటాయింపు కోరుకునే సాదాబైనామా జూన్, 2, 2014 కు ముందు రాసుకున్నదై ఉండాలి. ఈ క్రమబద్దీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు ఈ పథకం ఎంతమాత్రం వర్తించదు. ఉత్తర్వుల అమలు నిమిత్తం తగిన చర్యలు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ను, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

రిజిస్ట్రేషన్లు చేసుకునేది ఇలా..
సాదాబైనామా రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తి ఫారమ్ 10తో పాటు సాదాబైనామా జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత మండల తహశీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం ఫారమ్ 11 ద్వారా నోటీసు జారీచేసిన తహశీల్దారు సదరు ఆస్థిపై విచారణ చేయిస్తారు. విచారణ అనంతరం ఫారమ్ 10లో కోరిన భూమిని దరఖాస్తుదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్‌కు జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా మండల తహశీల్దారు సిఫారసు చేస్తారు.

భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓనరుతో ఎంతమాత్రం పనిలేదు. స్టాంపు డ్యూటీని కూడా మినహాయించడంతో లబ్దిదారులు ఒక్కరూపాయి చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా క్రమబద్దీకరణ అవకాశం ద్వారా ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు లక్షన్నర మంది వ్యవసాయ దారులకు తాజా ప్రక్రియ ద్వారా లబ్ది చేకూరనుంది.
 

మరిన్ని వార్తలు