24 గంటలూ ప్రజా సేవలోనే..

15 Mar, 2018 02:59 IST|Sakshi

     నేరాలపై ఉక్కుపాదం,శాంతిభద్రతలకు ప్రాధాన్యం 

     సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఏడు రోజులు... 24 గంటలు... ప్రజలకు సేవలందించడంలో ముందుంటామని సైబరాబాద్‌ నూతన పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. బుధవారం గచ్చిబౌలి లోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సందీప్‌ శాండిల్యా నుంచి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్‌లోని ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామని, సైబర్‌ నేరాల నియంత్రణ కు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మహి ళల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనరేట్‌ పరిధిలో సీసీటీవీ కెమెరాలను మరింత పెంచుతా మని చెప్పారు. స్నాచింగ్‌లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు.  

మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి.. 
మహిళలు, పిల్లలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, వీటి పూర్తిస్థాయి నియంత్రణకు సరికొత్త ప్రణాళికతో ముందుకెళతామన్నారు. కమ్యూనిటీ అండ్‌ సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఆర్థిక, వైట్‌ కాలర్‌ నేరాలను నియంత్రించడంతో పాటు ఆయా నేరాల తీరుపై ప్రజల్లో అవగాహన కలిగిస్తామన్నారు. సిబ్బంది సంక్షేమంతో పాటు మెరుగైన సేవలు అందించే వారికి ప్రత్యేక రివార్డులతో సత్కరిస్తామని, మరో పది రోజుల్లో కమిషనరేట్‌ పరిధిలోని అన్ని సమస్యలపై అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ షానవాజ్‌ ఖాసీమ్, క్రైమ్స్‌ డీసీపీ జానకీ షర్మిలా, ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.  

నేపథ్యమిదీ... 
1996(ఆర్‌ఆర్‌) ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన విశ్వనాథ్‌ చెనప్ప సజ్జనార్‌ మొదటగా వరంగల్‌ జిల్లాలోని జనగామలో, కడప జిల్లాలోని పులివెందులలో ఏఎస్‌పీగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్లగొండ, కడప, గుంటూరు, సీఐడీ ఆర్థిక నేరాల విభాగం, మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా, వరంగల్, ఆక్టోపస్‌లో, మెదక్‌లో అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా సేవలందించారు. ఇంటెలిజెన్స్‌ విభాగ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా పనిచేసి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు