సిరిసిల్ల నేతన్నలకు.. సం‘క్రాంతి’!

16 Oct, 2017 13:17 IST|Sakshi

తమిళనాడు పొంగల్‌కు సిరిసిల్ల చీరలు..

కేరళకూ ఎగుమతి

సిరిసిల్ల నేతన్నలకు కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొంగల్‌ (సంకాంత్రి) కోసం సిరిసిల్లలో చీరలు తయారు అవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం భారీగా పంచెలు, చీరలు ఆర్డర్‌ ఇవ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి లభిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగకు 52 లక్షల చీరలను సిరిసిల్లలో తయారు చేయించింది. దీంతో మెరుగైన ఉపాధి నేతన్నలకు లభించింది. కొత్తగా తమిళనాడు చీరల ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధికి కొత్త బాటలు పడుతున్నాయి.సిరిసిల్ల నుంచి మల్లికార్జున్‌

తమిళనాడులో 1.72 కోట్ల పంచెలు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండడంతో అక్కడ ఆ మేరకు ఒకే సారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవు తోంది. ఈ పని మూడు నెలలు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలుండగా.. సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, ఏడు వేల మరమగ్గాలపై కాటన్‌ (ముతక) రకం వస్త్రం ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఐదు లక్షల మీటర్ల వస్త్రం సిరిసిల్లలో ఉత్పత్తి అవుతుండగా.. ఈ మేరకు వినియోగం లేక ధర లభించడం లేదు. మరోవైపు షోలాపూర్, బీవండి, ఇచ్చంఖరేంజ్‌ లాంటి ప్రాంతాల నుంచి పోటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్‌ చీరలు, తువ్వాల, ధోవతులు, కర్చీఫ్‌లు, లుంగీలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు మంచి ఉపాధి లభించింది.

ఓనం.. ఓ మంచి గిరాకీ
సిరిసిల్లలో రెండు వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. తమిళనాడుకు అవసరమైన చీరలు, పంచెలను ఉత్పత్తి చేసే శక్తి సిరిసిల్ల నేతన్నలకు ఉంది. దీంతో మరమగ్గాలపై భారీ ఎత్తున చీరలు, పంచెలు ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో తయారైన చీరలు, ధోవతులను కేరళకూ ఎగుమతి చేస్తున్నారు. అక్కడ కూడా ఓనం పండగ సందర్భంగా సిరిసిల్ల చీరలను, పంచెలను వినియోగించేందుకు సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్‌కు సిరిసిల్ల వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.

సిరిసిల్లకు పండగ శోభ..
తమిళనాడులో ఏటా సంక్రాంతి (పొంగల్‌)కు పేదలకు ప్రభుత్వం వస్త్రాలను అందజేస్తుంది. మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు ఇస్తారు. ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతుండగా.. ఈ ఏడాది మూడు లక్షల చీరలు, మరో మూడు లక్షల పంచెలకు కొత్తగా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి మెరుగైంది. సిరిసిల్లలో డిసెంబరు 31 వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు మూడు నెలల ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, ధోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు.

పాలిస్టర్‌ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.80 పైసలు లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు.

మరిన్ని వార్తలు