రొట్టె.. కూడు పెట్టె..

17 Dec, 2014 08:40 IST|Sakshi

కామారెడ్డి : పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరాన ఉండే నర్సన్నపల్లి గ్రామానికి చెందిన నీల రాజేందర్ కొన్నేళ్ల క్రితం హోటల్ నడిపారు. అదే సమయంలో మక్క, జొన్న, గోధుమ రొట్టెలు చేసి విక్రయించేవారు. ఆర్డర్‌పై సరఫరా చేసేవారు. గిరాకీ పెరగడంతో సర్వపిండి, చెగోడీలు, గ్యారప్పలు చేయడం మొదలుపెట్టారు. ఆర్డర్‌పై సరఫరా చేసేవారు. వీటికీ ఆదరణ లభించింది. ఇంట్లోనే భార్య సహాయంతో పిండివంటలు చేసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బాగుండడంతో మరో ఇద్దరికి ఉపాధి చూపుతున్నారు. ఫోన్(99085 94328) చేసి ఆర్డరిస్తే చాలు.. పిండివంటలు సిద్ధం చేసి డోర్ డెలివరీ చేస్తారు.
 
 న్యాయవాదులు రెగ్యులర్ కస్టమర్లు..
 రాజేందర్ రోజూ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కామారెడ్డి కోర్టుల ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. ఆయన రెండు చేతుల్లో సంచులుంటాయి. వాటిలో సర్వప్పలుంటాయి. న్యాయవాదులకోసం వాటిని తీసుకొస్తారు. రాజేందర్ చేసే సర్వప్పలు రుచిగా ఉంటాయని న్యాయవాది క్యాతం సిద్ధరాములు తెలిపారు. ఫంక్షన్లకు, విందులకు అవసరమైన రొట్టెలు, అప్పాల గురించి ఆర ్డర్ చేస్తే.. సమయానికి డెలివరీ ఇస్తూ రాజేందర్ అందరి మన్ననలూ పొందుతున్నారు.
 
 సర్వపిండికి ఎక్కువ గిరాకీ
 సర్వపిండికి ఎక్కువ గిరాకీ ఉంటుందని రాజేం దర్ తెలిపారు. ఒక్కో సర్వపిండిని రూ. 15కు విక్రయిస్తున్నానని రోజూ 50 నుంచి 80 వ రకు అమ్ముడవుతాయని పేర్కొన్నారు. ఒక్కో జొన్న రొట్టెను ఆరు రూపాయలకు అమ్ముతానని, రోజూ 150 వరకు విక్రయిస్తానని తెలిపారు. చెగోడీలు, గ్యారప్పలను కిలోకు రూ. 140కి విక్రయిస్తానని, ఇవి రోజూ నాలుగైదు కిలోలు అమ్ముడవుతాయని వివరించారు. పప్పుపోలెలు కూడా తయారు చేసి విక్రయిస్తానన్నారు. ఖర్చులుపోనూ రోజుకు నాలుగైదు వందల రూపాయల వరకు మిగులుతున్నాయని పేర్కొన్నారు. తాను చేసేపనే ఇంటి పేరుగా మారింద ని, అందరూ తనను రొట్టెల రాజేందర్ అని పిలుస్తున్నారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు