-

గిరిజన విద్యార్థులను కాపాడండి

14 Mar, 2015 02:50 IST|Sakshi

వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగాచార్యులు
కొత్తగూడెం అర్బన్: ఓ కళాశాల యూజమాన్యం మోసపూరిత ప్రచారంతో గిరిజన విద్యార్థులను చేర్చుకుని చదువు చెప్పకుండా, హాస్టల్‌లో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులపాలు చేస్తున్నదని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగచార్యులు చెప్పారు. ఆయన శుక్రవారం కొత్తూగూడెం రైటర్ బస్తీలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని శ్రీమాన్విత ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ అండ్ పీజీ ప్రైవేటు కళాశాల యాజమాన్యం వారు హాస్టల్, లైబ్రరీ ఉచితమని చెప్పి గిరిజన విద్యార్థులను నమ్మించి చేర్చుకున్నారని చెప్పారు. ముందుగా ఒకొక్కరి నుంచి రూ.2000 వసూలు చేశారని అన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.4500, రెండవ సంవత్సరం వారికి రూ.6000, మూడవ సంవత్సరం వారికి రూ.6500 చొప్పున  గిరిజన విద్యార్థుల పేరు చెప్పి ఐటీడిఏ నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు.

గిరిజనుల పేరు చెప్పి ఐటీడిఏల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలాల యాజమాన్యాలు ఇలా డబ్బు తీసుకుంటున్నాయని అన్నారు. శ్రీమాన్విత కళాశాల వారు కూడా పరీక్షల ఫీజు రూ.400 అని చెప్పి రూ.1500 వసూలు చేసినట్టు చెప్పారు. హాస్టల్‌లో విద్యార్థులే వంటలు చేసుకుంటున్నారని, గ్లర్స్ హాస్టల్‌కు కనీసం వార్డెన్ కూడా లేదని, వరుసగా మూడు రోజులపాటు ఒకే రకం కూర పెడుతున్నారని చెప్పారు. ఈ కళాశాలకు కనీసం సైన్స్ ల్యాబ్ కూడా లేదని, కరెంట్ బిల్లు కూడా విద్యార్థులే కట్టుకోవాలని కళాశాల యాజమాన్యం చెబుతోందని అన్నారు. ఇందులో కళాశాల యాజమాన్యంతోపాటు ఐటీటీఏ అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఐటీడీఏలో అధికారులను కళాశాల యూజమాన్యం ‘కొనుగోలు’ చేసిందని ఆరోపించారు.
 
కళాశాల విషయాలు బయటకు చెబితే హాల్ టికెట్ ఇచ్చేది లేదని యూజమాన్యం బెదిరిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీమాన్విత కళాశాలతోపాటు అనేక కళాశాలల యూజమాన్యాలు ఇలాగే గిరిజన  విద్యార్థులను మోసగిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరిగేంతవరకు విద్యార్థులకు వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వసతి, భోజనం కల్పిస్తామని కొదమసింహం అన్నారు. ఈ కళాశాల విద్యార్థుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, మండల అధ్యక్షుడు కందుల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్, పట్టణ నాయకులు కంభంపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు