బిందు సేద్యంతో నీటి ఆదా..

25 Jan, 2019 11:23 IST|Sakshi
మామిడితోటను పరిశీలిస్తున్న శ్రీనివాసరావు తదితరులు

వర్ధన్నపేట: రైతులు బిందుసేద్యంతో ఎంతో నీటిని ఆదా చేసుకోవడంతో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా హార్టీకల్చర్‌ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రాయితీ ద్వారా రైతులకు అందించిన బిందు సేద్యం పరికరాలను గురువారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, బండౌతాపురం, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో తోటలకు హార్టీకల్చర్‌ అధికారి శ్రీనివాసరావు, వర్ధన్నపేట మండల హెచ్‌ఈఓ యమున, మైక్రో ఇరిగేషన్‌ కంపెనీ ప్రతినిధులు వెళ్లి రైతులు క్షేత్రస్థాయిలో అమర్చుకున్న పరికరాలను తనిఖీలు చేశారు. తనిఖీలతో పాటు ఇల్లందలోని చొల్లేటి యమునాదేవి మామిడి తోటలో అమర్చుకున్న బిందు సేద్య పరికరాలతో పాటు మామిడి తోటను పరిశీలించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మామిడి తోటలో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయన్నారు. వీటి భర్తీకి జింక్‌ సల్ఫేట్‌ 100 గ్రాములు ప్రతి చెట్టుకు అందించాలని తెలిపారు. దీంతో పాటు బోరాన్‌ లోపం ఉన్న తోటల్లో సాలిబోర్‌ 3 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మామిడి తోటలు పూత దశలో ఉన్నాయని తెలిపారు. ఇంకా పూత రాని తోటలో తేలికపాటి నీటి తడులతో పాటు మల్టీకే(13–0–45) 10 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. తెల్లపూత సమయంలో వచ్చే తేనె మంచు పురుగులు, తామర పురుగులు పూత చుట్టూ ఉండి నాశనం చేస్తాయని తెలిపారు.దీని నివారణకు ఇమిడాక్లోరిపైడ్‌ 0.3 మిలీ, ప్లానోఫిక్స్‌ 0.25 మిలీ ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేసుకుని నివారించుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు