వసతి గృహాల ప్రారంభమెప్పుడో..?

11 Sep, 2018 08:39 IST|Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల కళాశాలస్థాయి వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోక వందలాది మంది విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి బాలురు, బాలికలకు రెండు కళాశాల స్థాయి వసతి గృహాలు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రెండు బాలురు, ఒకటి బాలికల కళాశాలస్థాయి వసతి గృహాలు 40 రోజుల క్రితం మంజూరు కాగా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు, వసతి లేకపోవడంతో చదువులను అర్ధంతరంగా ఆపివేయాల్సిన దుస్థితి నెలకొంది.

జిల్లా కేంద్రానికి 16 మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు చదువు నిమిత్తం జిల్లా కేంద్రానికి రోజూ వచ్చి పోవడంతో బస్సు చార్జీలతో బెంబేలెత్తిపోతున్నా రు. సంక్షేమ వసతి గృహాలకు అద్దెకివ్వడానికి భవ న యజమానులు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. అద్దెకు దొరికిన భవనాల కిరాయిల అద్దె రేట్లు ప్రభుత్వానికి గుదిబండగా మారడంతో వసతి గృహాల ప్రారంభానికి గ్రహణం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అద్దె ధరలు తక్కువగా ఉండటం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అద్దె ధరలు పెంచే అధికారం సంక్షేమ అధికారులకు లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం.

పోటాపోటీ దరఖాస్తులు..
బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాల్సిన వసతి గృహాల్లో ఇప్పటికే 150కి మించి విద్యార్థులు ఉండడంతో ఏం చేయాలో పాలుపోక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలకు విద్యార్థుల ప్రవేశాల తాకిడి అధికమవ్వడంతో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉన్న వసతి గృహాలకు తోడు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి రెండు (బాలురు, బాలికలు), బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, వీణవంక, చొప్పదండి మండల కేంద్రాల్లోని ప్రీమెట్రిక్‌ హాస్టళ్లను పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లుగా మారుస్తూ జిల్లా కేంద్రానికి తరలించారు. ఐదు కళాశాల స్థాయి వసతి గృహాల్లో ప్రవేశాల కోసం 540 మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.

ఐదు హా స్టళ్లను నెలకొల్పుతూ తీసుకున్న నిర్ణయం 40 రోజు లు గడుస్తున్నా భవనాలు లభించకపోవడం, లభిం చిన చోట కిరాయి రేట్లు నిబంధనల ప్రకారం పొం తన లేకుండా ఉండడంతో వసతి గృహాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఒక చదరపు అడుగుకు రూ.5.50 చెల్లించే అవకాశం ఉంది. నగరంలో అద్దెలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ధర మాత్రం తక్కువగా ఉంది. దీనికితోడు ఖాళీ స్థలం, కారిడార్‌తోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు అద్దె కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఇంటి నిర్మాణం కొలతలు చూసి అద్దె నిర్ణయిస్తారు.

అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాల యజమానుల కిరాయి రేట్లకు పొంతన లేకుండా పోవడంతో వసతి గృహాల ప్రా రంభం కొలిక్కి రావడం లేదు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకోని సంక్షేమ శాఖల కళాశాల స్థాయి వసతి గృహాల ప్రారంభానికి కసరత్తు ముమ్మరం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘వసతి గృహాల భవనాల ప్రారంభానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాం. అద్దె భవనాల రేట్లు అధికంగా ఉండటం, ప్రభుత్వ నిబంధనలు సరిపోక పరిస్థితిని పైఅధికారులకు విన్నవించాం. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు