ఏళ్లతరబడి

19 Feb, 2018 14:40 IST|Sakshi

పూర్తికాని అదనపు గదులు 

అవస్థలు పడుతున్న విద్యార్థులు 

ములకలపల్లి : మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠ«శాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగు...తూనే ఉంది. దీంతో సరిపడా గదులులేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో పలుతరగతులను వరండాల్లో, చెట్ల కిందనే నిర్వహిస్తున్నారు.  ఆరు నుంచి పదో తరగతి వరకూ గల ‘సక్సెస్‌ స్కూల్‌’లో సుమారు 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతీ తరగతిలో తెలుగు మీడియంలో రెండు సెక్షన్లు, ఇంగ్లిష్‌ మీడియంలో ఒక సెక్షన్‌ మొత్తం 15 సెక్షన్లు ఉన్నాయి. తరగతి గదులతోపాటు ల్యాబరేటరీ, లైబ్రరీ, స్టాఫ్‌రూంలకు కలసి మొత్తం 18 గదులు కావాల్సిఉంది. కానీ ప్రస్తుతం పది గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మూడేళ్లుగా..:  కాగా ఈ పాఠశాలలో అదనపు తరగతి గదుల భవన సముదాయ నిర్మాణానికి ఆర్‌ఎంఎస్‌ఏ ఫేజ్‌–3లో రూ.36.48 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో 2014 సెప్టెంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్లు గడిచినా నేటికీ అసంపూర్తిగానే ఉంది. ఎట్టకేలకు చివరి దశకు వచ్చినా, ఇంకా కిటీకీలు, తలుపులతోపాటు ఫినిషింగ్‌ పనులతోపాటు, రంగులు కూడా వేయాల్సివుంది. దీంతో ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా మారింది. ఈ భవన నిర్మాణం పూర్తయితే తమ సమస్యలు తీరుతాయని భావించిన విద్యార్థులు ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు