మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విజయం

1 Apr, 2017 02:28 IST|Sakshi
మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విజయం

యూపీలో బీజేపీ గెలుపుపై సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్‌: మతోన్మాదాన్ని రెచ్చ గొట్టి, ఎస్సీ, బీసీ కులాల్లో చీలికను తీసుకురావడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. మతో న్మాదానికి ఊతమిచ్చేలా వివిధ కార్యక్ర మాలను చేపట్టి, దళితులు, మైనారిటీలపై దాడులు సాగించి యూపీ ప్రజల్లో భయో త్పాతాన్ని కలిగించడం ద్వారా ఈ విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయ సాధన నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సమీక్ష, భవిష్యత్‌ కార్యాచరణ ఖరారుకు శుక్రవారం ఎంబీ భవన్‌లో జరిగిన రెండు రోజుల రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సమావేశానికి ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వాగ్దానాల అమలులో కేసీఆర్‌ వైఫల్యం..
ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో చేసిన ఎన్నికల వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం అమలు చేయాలంటూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమాలు పెరుగుతుండటంతో కేసీఆర్‌ మళ్లీ కొత్త వాగ్దానాలు చేస్తున్నారన్నారు. వాటి అమలు పరిస్థితి ఏమిటో కొంతకాలంలోనే తెలిసి పోతుందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాదయాత్ర ప్రభావం, తదితర అంశాలపై తమ్మినేని నివేదికను సమర్పించారు. సామాజికన్యాయం నినాదంతో పార్టీ చేపట్టిన కార్యాచరణను ఇకముందు కూడా కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సీపీఎం పాదయాత్ర మంచి ఫలితాలనిచ్చిందని, కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఈ కృషిని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. దీనికి సంబంధించిన భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు