మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యం | Sakshi
Sakshi News home page

మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యం

Published Sat, Apr 1 2017 2:26 AM

మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యం - Sakshi

సాక్షి, అమరావతి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్‌ ఎ.చక్రపాణి వెల్లడించారు. సభ వ్యవహారాల్లో ఆయన రాజ నీతిజ్ఞతతో గౌరవ సభ్యుల మన్నలను పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో టీడీపీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ లోకేశ్‌ మాట్లాడుతూ పెద్దల సభలో ప్రభుత్వానికి మంచి సూచనలు, అభిప్రాయాలు ఇస్తూ సభా గౌరవాన్ని కాపాడుతున్నారని ప్రతిపక్ష పార్టీ సభ్యులను అభినందించారు. రెడ్డి సుబ్రమణ్యం తమ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎనలేని సేవ చేశారని అలాంటి వ్యక్తి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు.

శాసన మండలికి కొత్త రూపు: శాసన మండలికి కొత్త రూపు వచ్చినట్లైంది. ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య సహా 14 మంది సభ్యుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ సహా కొత్త సభ్యులు అడుగుపెట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత పదవీకాలం ముగియడంతో ఆ అర్హత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దక్కే అవకాశం ఉంది.  

హెరిటేజ్‌కు లోకేశ్‌ రాజీనామా: త్వరలో మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌ హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్‌లో తెలిపిన ఆయన తొమ్మిదేళ్ల హెరిటేజ్‌ ప్రయాణంలో అనేక విజయాలు సాధించడం తృప్తినిచ్చిందన్నారు.

Advertisement
Advertisement