టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?

30 Jun, 2015 18:35 IST|Sakshi
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంతో పలు అంశాల్లో తీవ్రంగా విభేదిస్తున్న డి శ్రీనివాస్.. గత కొంత కాలంగా తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా అగ్రనేత దిగ్విజయ్ సింగ్ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పిలిచినా కూడా.. మాట్లాడటం కాదు కదా, కనీసం ముఖం చూసేందుకు కూడా తనకు ఇష్టం లేదని ఆయన కటువుగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడింది దిగ్విజయ్ సింగేనన్నదే డీఎస్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.

కాగా.. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావుతో కూడా మంగళవారం నాడు డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. పార్టీలో చేరే విషయంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారని అంటున్నారు. డీఎస్ గనక పార్టీలో చేరితే.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా సోనియాగాంధీ పిలిచి.. పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తానంటే తప్ప.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశమే లేదని అంటున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో ఈ విషయమై విస్తృతంగా చర్చించారు. ఇక ప్రస్తుతం బాల్ డీఎస్ కోర్టులోనే ఉంది. ఆయన ఓ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు