ప్చ్‌..నిమ్స్‌!

30 Mar, 2018 08:01 IST|Sakshi

ప్రాభవం కోల్పోతున్న ప్రతిష్టాత్మక వైద్య సంస్థ

ఆస్పత్రిని వీడుతున్న ప్రముఖ సీనియర్‌ వైద్యులు..

పదవీ విరమణతో కొంత మంది..ఇమడలేక మరికొందరు దూరం  

ఉద్యోగ కాలం పొడిగించే అవకాశం ఉన్నా..పట్టించుకోని యాజమాన్యం..

బోసిపోతున్న కార్డియాలజీ, న్యూరోసర్జరీ, హెమటాలజీ, డయాబెటాలజీ విభాగాలు

కొనఊపిరితో ఉన్న రోగులు సైతం అక్కడికి చేరుకోగానే లేచికూర్చొంటారని భరోసా. ఎంతటి మొండి రోగాలైనా ఇట్టే నయం అవుతాయని ఎందరికో నమ్మకం. అనేక పరిశోధనలు, అరుదైన వైద్యసేవలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మక నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటల వల్ల కొంత మంది, పదవీ విరమణతో మరికొంత మంది సీనియర్‌ వైద్యులు ఆస్పత్రిని వీడుతుండటమే ఇందుకు కారణం. ఇక్కడి వైద్య సేవలపై సంతృప్తి కలగక...మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి ఉన్నతోద్యోగులు, సినీ, వ్యాపార ప్రముఖులు, మధ్య తరగతి పేయింగ్‌ రోగులు కూడా ఆస్పత్రికి దూరం అవుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు కాసులతో గలగలలాడిన ఆస్పత్రి ఖజానా ప్రస్తుతం ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు సరిపోని దుస్థితి నెలకొంది.   

సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్‌ ఆస్పత్రిలో సీనియర్‌ వైద్యుల కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 34 విభాగాలు ఉండగా, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ శేషగిరిరావు, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సుభాష్‌కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ అజిత్‌కుమార్‌లు ఇటీవల పదవీ విరమణ చేశారు. అంతర్గత విబేధాల వల్ల ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్‌ నరేందర్‌ ఇటీవలే ఆస్పత్రిని వీడారు. గతంలో న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మానసపాణిగ్రహి సహా, మరో న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ వీబీఎన్‌ ప్రసాద్‌ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్‌ శేషగిరిరావు ఉద్యోగ విరమణతో...అప్పటి వరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు (పెయింగ్‌)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు.

అదేవిధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్‌ సుభాష్‌కౌల్‌ సేవలందుకుంటున్న రోగులదీ అదే పరిస్థితి. డాక్టర్‌ నరేంద్ర ఆస్పత్రిని వీడటంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. షుగర్‌ వ్యాధి చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్‌ పీవీ రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవశ్చవంలా మారిపోయింది. నిజానికి పదవీ విరమణ పొందిన ప్రముఖ వైద్యుల్లో చాలా మంది బయటికి వెళ్లడం కంటే..ఆ తర్వాత కూడా ఇక్కడే పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలాంటి వైద్యుల పదవీ కాలం మరికొంతకాలం పొడిగించి వారి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ యాజమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు.  సీనియర్‌ వైద్యులంతా ఆస్పత్రిని వీడుతుండటం, జూనియర్లు ఆ స్థాయిలో రోగుల అభిమాన్ని చూరగొనలేక పోతుండటం వల్లే వీఐపీ రోగుల సంఖ్య తగ్గుతోందని సీనియర్‌ వైద్యుడొకరు అభిప్రాయపడ్డారు. 

భారీగా పడిపోయిన ఆదాయం
ఆస్పత్రి ఔట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 1500–2000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో 1500 మంది చికిత్స పొందుతుంటారు. నాలుగేళ్ల క్రితం పేయింగ్‌ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్‌ రోగుల శాతం పడిపోయింది. 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్‌ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్‌ఐ, సీజీహెచ్‌ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ల వద్ద బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోయాయి.

బకాయిలపై యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల ఛార్జీలను పెంచాల్సి వచ్చింది. ఏడాది క్రితం వరకు రూ.50 ఉన్న ఓపీ ఫీజు ప్రస్తుతం రూ.100 పెంచారు. అదే విధంగా ఈవినింగ్‌ క్లినిక్‌ ఓపీ ఛార్జీలను కూడా రూ.300 నుంచి రూ.500 పెంచడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు