ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి

30 May, 2014 01:52 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం చేపట్టిన ఆమరణదీక్షను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నాయకులతో కలిసి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా ముంపు మండలాలను విడదీయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ముంపు మండలాల విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీల మనుగడ కోసం వారి పక్షాల నిలుస్తామని, అవసరమైతే వారి కోసం ఆత్మహత్యకైనా సిద్ధమేనని అన్నారు. ముంపు మండల ప్రజల ఓట్లతో గెలిచిన తాము వారికి కృతజ్ఞతలు కూడా తెలిపే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, మైనార్టీలకు భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భయాందోళనల్లో ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు ఆర్డినెన్స్ నిలిపివేయాలని కోరారు.

 సీపీఎం చేపట్టిన ఈ దీక్షలకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ మాట్లాడుతూ ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం వల్ల ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారని, ప్రజాభిప్రాయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. ముంపు మండలాలను వెనక్కు తీసుకువచ్చేందుకు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ కలసివస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, జిల్లా కమిటీ సభ్యులు కొవ్వూరి రాంబాబు, గంటా కృష్ణ, మహిళా నాయకురాలు దామెర్ల రేవతి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు