కేంద్ర మంత్రిని కలిసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

9 Oct, 2019 18:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయానాల శాఖ మంత్రి సదానందగౌడను బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా యాసంగికి ఎరువులను కేటాయించాలని, ఇంపోర్టెడ్‌ యూరియా కాకుండా స్థానికంగా ఉత్పత్తి చేసిన యూరియానూ సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..  తాము గతంలోనే 7.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. కాగా, ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యం అయినా తరువాత వర్షాలు సమృద్దిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి సాగు విస్తీర్ణం పెరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి పది లక్షల ఎకరాలలో పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రానున్న రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా 8.5లక్షల ఎకరాలు పెరిగి సుమారుగా 42 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ మేరకు తాము గతంలో విజ్ఞప్తి చేసిన 7.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించాలని, అక్టోబరు మాసానికి 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాని 20వ తేదిలోపు పంపించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. మార్చి 2020 వరకు రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్‌ రన్‌ మొదలవుతుందని, ఆ తరువాత వచ్చే ఖరీఫ్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుండే ఎరువులు సరఫరా చేస్తామనిఘీ సందర్భంగా కేంద్ర మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మంత్రితో పాటు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, అదనపు సంచాలకులు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు