‘విండ్‌’కు సింగిల్‌ విండో

30 Sep, 2017 02:21 IST|Sakshi

త్వరలో పవన విద్యుత్‌ విధానం ప్రకటించనున్న ప్రభుత్వం

30 రోజుల్లో అన్ని రకాల అనుమతులు జారీ

రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయిస్తే 100% క్రాస్‌ సబ్సిడీ

2017–19లో 2,000 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: పవన విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ఉత్పత్తిదారులు, డెవలపర్లకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పవన విద్యుత్‌ విధానాన్ని ప్రకటించనుంది. 2017–19 కాలంలో రాష్ట్రంలో 2,000 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం.. మరోవైపు తెలంగాణ 4,224 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ వెల్లడించిన నేపథ్యంలో కొత్త పాలసీకి ప్రణాళికలు రూపొందిస్తోంది.

పాలసీ ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు 24 నెలల వ్యవధిలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తే పలు రాయితీ, ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ మేరకు ముసాయిదా పవన విద్యుత్‌ విధానాన్ని ఇంధన శాఖ రూపొందించింది.
 
సింగిల్‌ విండో విధానంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు 30 రోజుల్లో అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం జారీ చేయనుంది. మెగావాట్‌కు రూ.25 వేల చొప్పున లావాదేవీల చార్జీలను విధించనుంది.  
 విద్యుత్‌ ప్లాంట్ల కోసం డెవలపర్లు సేకరించే వ్యవసాయ భూములను ఆటోమెటిక్‌గా వ్యవసాయేతర భూములుగా భూ వినియోగ మార్పిడి చేసినట్లు ప్రభుత్వం పరిగణిస్తుంది. కంపెనీలు భూ వినియోగ మార్పిడి చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఎలాంటి భూ వినియోగ మార్పిడి ప్రక్రియ అవసరం ఉండదు.
 విద్యుత్‌ ప్లాంట్ల కోసం కొనుగోలు చేసే భూములకు ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం నుంచి మినహాయింపు కల్పించనుంది. సొంత అవసరాల కోసం నిర్మించే ప్లాంట్ల విద్యుత్‌ సరఫరా, పంపిణీ చార్జీలను మినహాయించనుంది.  
 సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఏర్పాటు చేసే ప్లాంట్ల విద్యుత్‌కు 100% బ్యాంకింగ్‌ సదుపాయాన్ని డిస్కంలు కల్పించనున్నాయి. డిమాండ్‌ గరిష్టంగా ఉండే ఫిబ్రవరి–జూన్‌లో, ఇతర సమయాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు బ్యాంకింగ్‌ చేసిన విద్యుత్‌ను తిరిగి పొందడానికి అవకాశం ఉండదు. మిగిలిన సమయాల్లో బ్యాంకింగ్‌ విద్యుత్‌ను ఉత్పత్తిదారులు వెనక్కి తీసుకోవచ్చు.  
 సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసే ప్లాంట్లకు విద్యుత్‌ సుంకాన్ని ప్రభుత్వం మినహాయించనుంది.  రాష్ట్రంలో విద్యుత్‌ విక్రయించే పవన విద్యుత్‌ ప్లాంట్లకు 100 శాతం క్రాస్‌ సబ్సిడీ సర్‌ చార్జీని మినహాయించనుంది.  
 విద్యుత్‌ సరఫరా, పంపిణీ గ్రిడ్లకు అనుసంధానం కోసం సరఫరా, పంపిణీ లైన్ల ఏర్పాటు బాధ్యత ఉత్పత్తిదారులదే. అయితే ట్రాన్స్‌కో, డిస్కంలకు చెల్లిం చాల్సిన పర్యవేక్షణ చార్జీలను మినహాయించనుంది. ప్లాంట్ల ఏర్పాటుకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిపాదనలను ట్రాన్స్‌కో, డిస్కంలు 30 రోజుల్లో పరిష్కరిస్తాయి.  
 విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనకు స్థానిక గ్రామ పంచాయతీకి ఎకరాకు రూ.25 వేలు చొప్పున అభివృద్ధి చార్జీలు డెవలపర్లు చెల్లించాలి. 14 పనిదినాల్లో గ్రామ పంచా యతీలు ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.  
 ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి అన్ని పరికరాలపై 100 శాతం స్టేట్‌ జీఎస్టీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.  
 భూ రిజిస్ట్రేన్లపై 100 శాతం స్టాంప్‌ డ్యూటీని తిరిగి చెల్లించనుంది.  
 ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్ముకునేందుకు ఇంట్రాస్టేట్‌ ఓపెన్‌ యాక్సెస్‌ అనుమతులను  ప్రభుత్వం జారీ చేయనుంది.   
 సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లను ఒకే చోట నిర్మించే విధంగా హైబ్రిడ్‌ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

మరిన్ని వార్తలు