వీడియోకాల్‌తో ప్రతీ ఇంటి నల్లా పరిశీలన

21 Sep, 2019 01:57 IST|Sakshi

మిషన్‌ భగీరథ సమీక్షలో సెక్రటరీ స్మితా సబర్వాల్‌

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ప్రతీ ఇంటి నల్లా కనెక్షన్‌ను వీడియో కాల్‌ ద్వారా పరిశీలించనున్నట్లు మిషన్‌ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ వెల్లడించారు. ఇంటింటికి నల్లాతో నీరు సరఫరా అవుతున్న తీరుపై సర్పంచ్‌లతో త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమ ప్రమాణాలు,

నీటి శుద్ధి ప్రక్రియతో సరఫరా అవుతున్న భగీరథ నీటిని తాగేలా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. పరిగి, గట్టు మండలాల  స్థానిక ప్రజాప్రతినిధులకు భగీరథ నీటి వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు మంచి బాగుందని అధికారులను అభినందించారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు తమ గ్రామా ల్లోని ప్రజలంతా భగీరథ నీటినే వినియోగించేలా చైతన్యపరుస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్‌ ఇంజనీర్లు జగన్మోహన్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, విజయ్‌ప్రకాశ్, వినోభాదేవి, చెన్నారెడ్డి, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు