ఏపీ ఎన్జీఓ నేతల కుట్ర

12 Feb, 2019 03:52 IST|Sakshi

ఉద్యోగుల భూములు అమ్ముకునేందుకు ప్రయత్నించారు

భాగ్యనగర్‌ టీఎన్జీఓ సమావేశంలో వక్తల ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో గచ్చి బౌలి హౌసింగ్‌ సొసైటీకి ఇచ్చిన భూములను అమ్ముకునేందుకు ఏపీ ఎన్జీఓ నేతలు కుట్రలు చేశారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులు కష్టపడి కూడబెట్టుకుని పైసలతో ఏపీ ఎన్జీఓలు జల్సాలు చేశారని, ప్లాట్లు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారని టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్, టీఎన్‌జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మండిపడ్డారు.

ఇటీవల గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎంపికైన విషయం తెలిసిందే. భాగ్యనగర్‌ టీఎన్జీఓ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్‌ చైర్మన్‌గా, పి.బలరాం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా గచ్చి బౌలి హౌసింగ్‌ సొసైటీ నూతన కార్యవర్గ సమావేశంలో నాంపల్లిలోని ఇంది రా ప్రియదర్శిని ఆడిటోరి యంలో సోమవారం నిర్వహించారు. ఏపీ ఎన్జీఓగా ఉన్న పేరును గచ్చిబౌలి హౌసిం గ్‌ సొసైటీగా మార్చుతూ తీర్మానం చేసి నోటీసులిచ్చారు.  సొసైటీ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. 

ఆంధ్రా నేతలు అమ్ముకునేవారే..
గచ్చిబౌలిలో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని రక్షించేందుకే సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మెమో జారీ చేశారని శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, మమత చెప్పారు. ప్రభుత్వం మెమో జారీ చేయకుంటే ఉన్న భూమిని మొత్తం ఆంధ్రా నేతలు అమ్ముకునేవారన్నారు. ఏపీ ఎన్జీఓలో సభ్యులుగా ఉంటూ గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ కోసం సత్యనారాయణ బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు పద్మాచారి, రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు