టెన్త్‌ విద్యార్థులపై దృష్టి పెట్టండి

19 Nov, 2017 08:32 IST|Sakshi

 ఫలితాలపై ప్రత్యేక ప్రణాళిక రచించాలి 

 మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండాలి 

 ఆర్‌జేడీ విజయలక్ష్మీబాయి 

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇప్పటినుంచే విద్యాబోధనలో మార్పులు రావాలి.. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.. ప్రత్యేక ప్రణాళికలు రచించి వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్‌జేడీ) విజయలక్ష్మీబాయి ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆర్‌జేడీ జడ్చర్ల జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల, నక్కలబండ ప్రాథమిక, జిల్లాకేంద్రంలోని షాసాబ్‌గుట్ట పాఠశాలలను సందర్శించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలన్ని   ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలోని వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, విద్యాబోధన, ఉపాధ్యాయుల సమయపాలన, ఇబ్బందులు, తదితర అంశాలను డీఈఓ సోమిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డీఈఓగా పనిచేసిన ఆమె  ఆర్‌జేడీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా జిల్లా పర్యటనకు రావడంతో ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో సెక్షన్‌ అధికారులు వెంకటేశ్వర్‌గౌడ్, విజయభాస్కర్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

హాజరుశాతంపై ఆరా 
అనంతరం షాసాబ్‌గుట్ట పాఠశాలను ఆర్‌జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల వారీగా సబ్జెక్టుపై బోధిస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసి విద్యార్థుల హాజరుశాతంపై ఆరా తీశారు. 
 
ఫలితాలు మెరుగ్గా రావాలి 
జడ్చర్ల టౌన్‌: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావాలని ఆర్‌జేడీ విజయలక్ష్మీ ఆదేశించారు. శనివారం జడ్చర్ల జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు వేశారని హెచ్‌ఎంలు రాజేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి నక్కలబండతండా ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచికరంగా ఉండాలని సూచించారు. అధికారి వెంట ఎంఈఓ మంజులాదేవి ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు