మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు

9 Mar, 2015 01:59 IST|Sakshi

సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అవసరమైతే ప్రస్తుత చట్టాలను సవరించేందుకూ వెనకాడమని చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆ దిశగా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా చట్టాలను కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో బాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షీ టీం’ బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ 24గంటలు పని చేయనుందన్నారు. వాట్సప్ నంబర్ 94906 17555, కాల్ సెంటర్ 94409 01835 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు.

మరిన్ని వార్తలు