ప్రాణ ప్రదాతలు

2 Nov, 2017 07:07 IST|Sakshi

ఇండియా హెల్త్‌లైన్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు  

మూడు బ్లడ్‌ వాట్సప్‌ గ్రూపులతో సేవలు  

ఆదర్శంగా నిలుస్తున్న రాయదుర్గం యువకులు

107సార్లు రక్తదానం చేసిన సంపత్‌కుమార్‌

అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్‌ హాజీ

సమాజం మనకేమిచ్చిందని వారేనాడూ అనుకోలేదు.. సమాజానికి మనమేం చేశామనే తలంచారు ఆ యువకులు. సాటి మనుషులకు సాయపడటమే జీవన పరమాధిగా భావించారు. రక్తదానంతో పలువురికి ప్రాణదాతలుగా మారారు. ఇండియా హెల్త్‌లైన్‌ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి రక్తదానం చేస్తున్నారు రాయదుర్గం ప్రాంతానికి చెందిన పలువురు యువకులు. 20 ఏళ్లలో సుమారు 107సార్లు రక్తదానం చేశారు కోట సంపత్‌కుమార్‌. వీరితో పాటు   కానిస్టేబుల్‌ హాజీ సైతం సామాజిక సేవలో పాలుపంచుకుంటూ పలువురిని అవయవ దానానికి ప్రోత్సహిస్తున్నారు. అటు రక్తదానం, ఇటు అవయవ దానం  చేస్తూ.. జీవదాతలుగా మారిన యువకులపై ప్రత్యేక కథనం.  

ఆ వార్తే కదిలించింది..
అంబర్‌పేట: ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి రక్తం అందకపోవడంతో మృతి చెందాడని దినపత్రికలో వచ్చిన వార్త అతడి మనసును చలింపజేసింది. సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు తనవంతు కర్తవ్యంగా రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గడిచిన 20 ఏళ్లలో 107 సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచాడు కోట సంపత్‌కుమార్‌. ప్రకాశం జిల్లా కుడిచెడుకు చెందిన సంపత్‌కుమార్‌ జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం మాదాపూర్‌కు వచ్చి ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గాంధీ ఆస్పత్రిలో రక్తం అందక ఓ రోగి మృతిచెందాడని ఓ దినపత్రికలో వచ్చిన వార్త చదివి చలించిపోయాడు.  వెంటనే ఆ ఆస్పత్రికి వెళ్లి రక్తం అవసరమున్న రోగికి రక్తదానం చేసి వెళ్లాడు. అప్పట్నుంచి రక్తదానం చేస్తూనే ఉన్నాడు. గత 20 ఏళ్లలో ఆయన 107సార్లు రక్తదానం చేసి  పలువురికి ప్రాణదాతగా మారాడు. తాను ఒక్కడే కాకుండా మిత్రులను సైతం రక్తదానం చేసేందుకు ఒప్పించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సిమ్‌కార్డు తీసుకొని సోషల్‌ మీడియాలో సైతం అందుబాటులో ఉంచాడు.   

 అపోహలు వీడి ముందుకు రండి..
రక్తదానంపై యువత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రెండువందల సార్లు రక్తదానం చేయవచ్చు. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రూ.25 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ నిలిచిపోయిన సందర్భంలో నేను రక్తదానం చేశా. ఆ ఆపరేషన్‌ సక్రమంగా జరిగేలా చేసిన సంఘటన ఎప్పటికీ మరవలేను. ఆపదలో రక్తం కావాల్సినవారు 99923 45678లో సంప్రదించవచ్చు.     – సంపత్‌కుమార్‌  

ఆదర్శం.. హాజీ, అనాథలకు అండ...,ఆపన్నులకు చేయూత

అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్‌
అతనో సాధారణ కానిస్టేబుల్‌. మెడికల్‌ డ్యూటీ అతని విధి. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ఎవరైనా మృతి చెందినా వెంటనే అక్కడ వాలిపోయి కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తాడు. మృతి చెందిన వ్యక్తి అవయవాలు దానం చేయాలంటే 8 గంటల సమయం మించిపోకూడదు. ఆ విషయాన్ని గుర్తెరిగిన కానిస్టేబుల్‌ వెంటనే కుటుంబసభ్యులను ఒప్పించే పనిచేస్తాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 25 మందికి పైగా కంటి చూపునిచ్చి ఉన్నతాధికారులతో శభాష్‌ అనిపించుకున్నాడు. ఎక్కడ పనిచేసినా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రశంస పత్రాలు అందుకున్నాడు. అంతే కాదు.. తాజాగా తప్పిపోయిన ఓ వృద్ధురాలిని ఆమె కుమారుల చెంతకు చేర్చి మానవత్వం చాటుకున్నాడు. ఆయనే పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ హాజీ అహ్మద్‌.   – కుత్బుల్లాపూర్‌  

ఎందరో అనాథలు సిటీలో వివిధ కారణాలతో కన్ను మూస్తున్నారు. వారు బతికి ఉన్నప్పుడే ఆదరించేవారు లేరు. ఇక చనిపోతే ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వారికి బంధువులా మారతారు హాజీ. ఎవరైనా అనాథ చనిపోతే సొంత డబ్బులతో అంత్యక్రియలు జరిపిస్తుంటారు. 2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన హాజీ ఐదేళ్లు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. శామీర్‌పేట్, బాలానగర్‌ పీఎస్‌లలో పనిచేసి, మూడేళ్ల క్రితం పేట్‌ బషీరాబాద్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. రెండేళ్ల క్రితం మెడికల్‌ డ్యూటీ (ఎంసీ) బాధ్యతలు అప్పగించారు. మొదట భయపడిన హాజీని ఎస్సై వెంకటేశ్‌ భుజం తట్టి ధైర్యం చెప్పడంతో నాటి నుంచి నేటి వరకు ఏ పని అప్పగించినా పట్టువీడని విక్రమార్కుడిలా చేస్తున్నారు.  
 
అవగాహన కల్పిస్తూ..  
మంచి చేయాలన్న తలంపు వచ్చిన హాజీకి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రమాదాల్లో మృతి చెందినా, బ్రెయిన్‌డెడ్‌తో ఎవరైనా చనిపోతున్నారని తెలిసినా కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవ దానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా 25–30 మంది కళ్లను దానం చేసేందుకు ఒప్పించారు హాజీ. ఇటీవల సంగీత (38) అనే మహిళకు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు అవయవ దానం చేయించారు.

చేరదీసి.. ఇంటికి చేర్చి  
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన లింగమ్మ అనే వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. కాటేదాన్‌లో ఉండే తన కుమారుడి ఇంటికి వచ్చి ఆమె దారితప్పి సుచిత్ర సర్కిల్‌కు చేరింది. అక్కడ ఓ వాహనదారుడు లింగమ్మను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న హాజీ.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత జయరాంనగర్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అనంతరం వివరాలు తెలుసుకొని లింగమ్మను ఆమె కుమారులకు అప్పగించారు.  

ఒక్క మెసేజ్‌తో..
రాయదుర్గం:  సేవ లక్ష్యంగా.. ప్రాణదానమే పరమార్థంగా పలువురు యువకులు రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్, మెసేజ్‌తో వచ్చిన వెంటనే ఆçస్పత్రికి వెళ్లి ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి రక్తమిస్తున్నారు. ఇండియా హెల్త్‌ లైన్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు.  2015 ఏప్రిల్‌ 10న ఏర్పాటైన ఈ గ్రూపులో మొదట్లో పది మంది మాత్రమే ఉండేవారు. అనంతరం నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారూ ఈ గ్రూపులో చేరారు. ప్రస్తుతం మూడు బ్లడ్‌ వాట్సప్‌ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ మూడింటిని రాయదుర్గం ప్రాంతానికి చెందిన నిఖిల్‌యాదవ్‌ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో 256 మంది చొప్పున ఉండగా మూడో గ్రూపులో 175 మంది సభ్యులున్నారు. రక్తదానం చేసేందుకు వీరంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయా వాట్సప్‌ గ్రూపుల్లో చిన్న మెసేజ్‌ పెడితే చాలు స్పందించి ఏ ప్రాంతం, ఏ ఆస్పత్రి, అందుబాటులో ఎవరుంటారో గుర్తించి అక్కడికి రక్తదానం చేస్తున్నారు.
 
కార్యాచరణకు అంకురార్పణ ఇలా..  
2015 ఏప్రిల్‌లో నిఖిల్‌ యాదవ్‌ నానమ్మకు రక్తం అవసరమైంది. నానల్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా నగరంలోని ఓ బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి ‘బి’ పాజిటివ్‌ కావాలని అడగగా.. నిఖిల్‌ బ్లడ్‌ను తీసుకోవడంతోపాటు రూ.1000 తీసుకున్నారు. దీంతో ఆరోగ్యవంతులైన యువకులతో ఓ బ్లడ్‌ గ్రూపును ఏర్పాటు చేయాలనుకున్నారు నిఖిల్‌. మానవతా దృక్పథంతో కుల మతాలకతీతంగా రక్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.   

450 మందికి రక్తదానం చేశాం..
ఇండియా హెల్త్‌లైన్‌లో సుమారు 700 మంది సభ్యులున్నారు. వీరు ఇప్పటివరకు 450 మందికి ఉచితంగా రక్తాన్ని అందించారు. అంతేకాకుండా 20 మందికి ప్లేట్‌లెట్స్‌ కూడా ఇచ్చాం. రక్తం అవసరమున్నవారు 80194 53480 నంబరుకు వాట్సప్‌ గ్రూపులో రోగి పేరు, వ్యాధి, చికిత్స పొందుతున్న ఆస్పత్రి పేరు, నగరంలోని ప్రాంతం పేరును మెసేజ్‌ చేస్తే రక్తం ఇస్తాం. నగరంలో పలు చోట్ల బ్లడ్‌ గ్రూప్‌ నిర్ధారణ కోసం ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం.   – నిఖిల్‌ యాదవ్, ఇండియా హెల్త్‌లైన్‌ నగర ప్రధాన కార్యదర్శి

రాయదుర్గంలో బ్లడ్‌గ్రూప్‌ నిర్ధారణ శిబిరంలో ఇండియా హెల్త్‌లైన్‌ ప్రతినిధులు (ఫైల్‌)

మరిన్ని వార్తలు