పాఠశాల పిల్లగాడా.. పశులుగాసే పోరగాడా..

24 Jan, 2020 13:38 IST|Sakshi

జామకాయలు దొంగిలించాడని టీసీ ఇచ్చిన ఫలితం

సాక్షి, మర్పల్లి : సాక్షి దినపత్రికలో ప్రచురితమైన పశువులు కాస్తున్న విద్యార్థి కథనంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. జామకాయలు దొంగతనం చేశాడన్న కారణంగా పాఠశాల హెడ్ మాస్టర్ ఒక విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించగా, సదరు విద్యార్థి పశువులను కాస్తున్నాడంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వెంటనే సదరు విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారం మొత్తంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. ఆ బాలుడి పేరు కిషన్‌. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ఈ నెల 11న తోటి విద్యార్థులతో కలసి పాఠశాల పక్కనున్న తోటలో జామకాయలు తెంపాడు. దాంతో జామకాయలు దొంగతనంగా కోయడాన్ని తెలుసుకున్న హెడ్ మాస్టర్ నర్సింగ్‌రావు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆంగోత్‌ శంకర్, చాందీబాయిని పిలిచి.. ‘మీ అబ్బాయి దొంగతనాలు చేస్తున్నాడు. గతంలో కూడా అతను తండాలో దొంగతనాలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. తీసుకెళ్లండి’ అంటూ టీసీ చేతిలో పెట్టి పంపించారు. టీసీ ఇస్తే ఎలా అని, చదువు ఆగిపోతుందంటూ ఈ ఏడాది పాఠశాలలోనే ఉంచాలని తల్లిదండ్రులు వేడుకున్నా హెచ్‌ఎం వినిపించుకోలేదు. దాంతో చేసేది లేక కిషన్‌ పశువుల కాపరిగా మారాడు.

మరిన్ని వార్తలు