కథా టీచర్‌

30 Oct, 2018 08:34 IST|Sakshi
జానపద, మౌఖిక కథలకు అంతర్జాతీయ పట్టం కట్టిన దీపాకిరణ్‌

పిల్లల్లో నైతిక విలువల పెంపునకు కృషి

కథలు చెప్పడంలో వేలాది మందికి శిక్షణ

స్టోరీ ఆర్ట్స్‌ఫౌండేషన్‌ ఏర్పాటు  

డిసెంబర్‌ 11–14 వరకు నగరంలో వర్క్‌షాప్‌  

అది టెహ్రాన్‌.. ఓ సాయంత్రం వేళ ఎంతో మంది విదేశీ ప్రముఖులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్‌ ఆసీనులై ఉన్నారు. ఇరాన్‌లో అత్యంతవైభవంగా నిర్వహించే ‘కనూన్‌’ ఉత్సవానికి వేదిక అది. కనూన్‌ అంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం. వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరో తరానికి సాగుతున్న వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రవాహమది. ఆ వేడుకలో భారత్‌ తరఫున హాజరైన మన హైదరాబాదీ స్టోరీ టెల్లర్‌ దీపాకిరణ్‌ కథానృత్య ప్రదర్శనతో ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది.భారతీయ సాంస్కృతిక జీవనాన్నిసమున్నతంగా ఆవిష్కరించింది. 

సాక్షి, సిటీబ్యూరో  : రెండేళ్ల కిత్రం ఇరాన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కనూన్‌’ వేడుకలో దీపాకిరణ్‌ ప్రదర్శించిన ‘మీరాబాయి నృత్య ప్రదర్శన’ అందర్నీ ఆకట్టుకుంది. తన గాత్రంతో, నృత్యంతో ఎంతో హృద్యంగా కథలు చెప్పే దీపాకిరణ్‌ అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనానికి వారధిగా నిలిచారు. పిల్లలకు కథలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చేందుకు ఏకంగా ‘స్టోరీ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌’నే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2,500 మందికి శిక్షణనిచ్చారు. త్వరలో వివిధ దేశాలకు చెందిన స్టోరీ టెల్లర్స్‌తో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీపాకిరణ్‌ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.  

కళాత్మకంగా విద్యాబోధన..
‘పిల్లలకు చదువు చెప్పడం ఆర్టిస్టిక్‌గా ఉండాలి. వారిలో ని సృజనాత్మకతకు పదును పెట్టాలి. అకాడమిక్‌ అంశాలను కథలతో, కళారూపాలతో కలిపి బోధిస్తే ఇట్టే ఆకట్టుకుంటాయి. పిల్లలు ఒత్తిడి నుంచి దూరమవుతారు. అలాగే  చిన్నప్పటి నుంచే ఉన్నతమైన నీతి, నైతిక విలువలను బోధించినట్లవుతుంది. ఈ లక్ష్యంతోనే ‘స్టోరీ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌’ స్థాపించాను. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలోని టీచర్లకు స్టోరీ టెల్లింగ్‌ శిక్షణనిస్తున్నాం. ఇప్పటి వరకు 2500 మందికిపైగా ఉపాధ్యాయినులు చక్కటి స్టోరీ టెల్లర్స్‌గా మారారు. పిల్లలకు కథలు చెబుతున్నారు. విభిన్న కళారూపాలలో ఈ స్టోరీ టెల్లింగ్‌ ప్రక్రియ సాగుతోంది’ అంటూ ఫౌండేషన్‌ లక్ష్యాన్ని వివరించారు దీపాకిరణ్‌. ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11–14 వరకు నగరంలో ఇంటర్నేషనల్‌ స్టోరీ టెల్లింగ్‌ వర్క్‌షాపును నిర్వహించనున్నారు.   

కథల సమాహారం..
వేలకొద్దీ కథలు, వందల కొద్దీ కళారూపాలు. ఏ కథ ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తున్నాయి. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే మౌఖిక కథలు, జానపద కళాకారులు వివిధ కళారూపాల్లో చెప్పే పురాణేతిహాస ఘట్టాలు. ఇలా ఎన్నో రకాల కథలకు, కళారూపాలకు దీపాకిరణ్‌ నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఆటాపాటలతో కథలు చెబుతూ ఆకట్టుకుంటున్నారు. పెద్దలు చెప్పే కథలను మరింత ఆధునికీకరించి వాటికి ఉన్నత విలువలను జత చేసి పిల్లల హృదయాలను హత్తుకునేలా చెబుతున్నారు. ఒక చేతిలో చిరుతలు, మరో చేతిలో ఏక్‌తారా, కథనానికి అనుగుణమైన నృత్యం, డప్పుల దరువు ఎంతో అద్భుతంగా ఉంటాయి. 

మరిన్ని వార్తలు