'పానీ' పట్టులుండవ్‌!

21 Feb, 2018 08:13 IST|Sakshi

వేసవిలో తాగునీటి సరఫరాకు డోకా లేదు

కృష్ణా, గోదావరి జలాలతో పాటు జంట జలాశయాల నుంచీ నీటి వినియోగం

వెయ్యి కాలనీలు, బస్తీలకు కొత్తగా తాగునీటి వ్యవస్థ

మార్చి నుంచి శివార్లకు తీరనున్న దాహార్తి

గత ఏడాదితో పోలిస్తే పెరిగిన భూగర్భ జలమట్టాలు

నగరంలో నీటి సమస్య లేకుండా చేసేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. వచ్చే వేసవిలో తాగునీటికి ఎలాంటి డోకా లేదని భరోసా ఇస్తోంది. కృష్ణా, గోదావరి జలాలే కాకుండా...అత్యవసర పరిస్థితుల్లో  హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల నుంచి సైతం నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హడ్కో నిధులతో 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన పట్టణ మిషన్‌ భగీరథ పనులు కొలిక్కిరావడంతో  వెయ్యి కాలనీలు, బస్తీలకు సైతం రోజువిడిచి రోజు ఇక తాగునీరందుతుంది.     

సాక్షి,సిటీబ్యూరో: మహానగరం ఇపుడు త్రివేణీ సంగమంగా భాసిల్లుతోంది. కృష్ణా, గోదావరి జలాలే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో ఈసీ..మూసీ..ఎగువన నిర్మించిన జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ నీటిని సైతం  నగరం నలుమూలలకు కొరత లేకుండా సరఫరా చేసే అవకాశం ఉంది. నీటి సరఫరాకు వీలుగా కృష్ణా, గోదావరి రింగ్‌మెయిన్‌ పైప్‌లైన్లు అందుబాటులోకి రావడంతో ఈ  వేసవిలో గ్రేటర్‌ నలుమూలల్లో నవసిస్తోన్న సిటీజన్లకు పానీపరేషాన్‌ ఉండబోదని జలమండలి భరోసానిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగర తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న విషయం విదితమే.

కాగా  ఏప్రిల్‌ రెండోవారం నాటికి నాగార్జున సాగర్‌ జలాశయంలో నీటిమట్టాలు 510 అడుగులకు దిగువనకు చేరినప్పటికీ గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా జలాలకు ఢోకా లేకుండా అత్యవసర పంపింగ్‌ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు గతేడాది రూ.1900 కోట్ల హడ్కో నిధులతో 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన పట్టణ మిషన్‌ భగీరథ పనులు కొలిక్కివచ్చాయి. ఆయా సర్కిళ్లలో నూతనంగా 1900 కి.మీ మేర పైపులైన్లు...54 భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించారు. ఇవన్నీ దాదాపు పూర్తికావచ్చాయి. పైపులైన్‌ పనులు పూర్తయిన ప్రాంతాల్లో నూతనంగా వెయ్యి కాలనీలు, బస్తీలకు ప్రధాన నగరంతో సమానంగా రోజువిడిచి రోజు తాగునీటిని అందించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు గ్రేటర్‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే జనవరి చివరినాటికి హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సరాసరి 0.36 మీటర్లు...రంగారెడ్డి జిల్లా పరిధిలో సరాసరి 4 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు పెరగడం విశేషం. 

కృష్ణా జలాలకు అత్యవసర పంపింగ్‌..గోదావరికి నో ఫికర్‌..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల నీటిని ప్రస్తుతానికి నగర తాగునీటి అవసరాలకు వినియోగించడం లేదు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి తరలింపును సైతం పరిమితంగానే ఉంది.  దీంతో గ్రేటర్‌కు ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాలే ప్రాణాధారమయ్యాయి. ప్రస్తుతం గ్రేటర్‌ దాహార్తిని తీరుస్తోన్న కృష్ణా జలాలను నాగార్జునసాగర్‌ నుంచి అక్కంపల్లి..కోదండాపూర్‌ మీదుగా గ్రేటర్‌కు తరలిస్తున్నారు. సాగర్‌ గరిష్ట మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 525 అడుగులుగా ఉంది. అయితే ఇరిగేషన్‌ అవసరాలకు సాగర్‌జలాలను ఈసారి విరివిగా వినియోగించనున్న నేపథ్యంలో నీటిమట్టాలు ఏప్రిల్‌ రెండోవారం నాటికి 500 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ తాజాగా జలమండలి అధికారులకు లేఖ రాశారు. ఈనేపథ్యంలో సాగర్‌బ్యాక్‌వాటర్‌(పుట్టంగండి)వద్ద గతేడాది ఏర్పాటు చేసిన తరహాలోనే 10 భారీమోటార్లతో నీటిని తోడి గ్రేటర్‌కు నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణా జలాలను అత్యవసర పంపింగ్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈ లేఖలో సూచించారు. ఈనేపథ్యంలో సుమారు రూ.3.5 కోట్లతో ఈ ఏర్పాట్లను చేయనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా నగరానికి ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ జలాశయం గరిష్టమట్టం 485.560 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటినిల్వలు 479.200 అడుగుల మేర ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం నగర తాగునీటి అవసరాలకు 130 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జలమండలి అధికారులు స్పష్టంచేస్తున్నారు. కాగా మొత్తంగా ఆయా జలాశయాల నుంచి నిత్యం గ్రేటర్‌ నగరానికి 432 మిలియన్‌ గ్యాలన్ల జలాలను తరలిస్తున్నారు.

ఈ వేసవిలో నీళ్లు ఫుల్లు  
రాబోయే వేసవిలో కృష్ణా, గోదావరి జలాలకు ఎలాంటి ఢోకా ఉండదు. శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో హడ్కో పనులు పూర్తికావడంతో నూతనంగా వెయ్యి కాలనీలు, బస్తీలకు దాహార్తి దూరం కానుంది. ఆయా ప్రాంతాల్లో నూతనంగా సుమారు 70 వేల వరకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నాం. నిరుపేదలకు రూ.1 కే నల్లా కనెక్షన్‌ మంజూరు చేస్తాం. మార్చి నెల నుంచి ప్రధాననగరంతో సరిసమానంగా శివార్లకు తాగునీటిని సరఫరా చేస్తాం.   – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు