ఆ పంటలకు ఆశాజనకంగా ధర

4 Jun, 2020 13:46 IST|Sakshi
సోయాబీన్‌ పంట

సోయా, కందులు, పెసర్లకు ‘మద్దతు’ పెంచిన కేంద్రం

ఈ పంటలను సాగు చేయాలని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

మోర్తాడ్‌(బాల్కొండ): సోయా, కందులు, పెసర్లకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో నూతన వ్యవసాయ విధానం అమలుతో రైతులకు ప్రయోజనం కలుగనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వర్షాకాలంలో మొక్కజొన్నకు బదులు సోయా, కందులు, పెసర్లు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలకు మినిమం సపోర్టు ప్రైస్‌(ఎమ్మెస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా సోయా, కందులు, పెసర్లకు గతంలో కంటే ఎక్కువ ధర పెరిగింది.

సోయాకు గతంలో క్వింటాలుకు రూ.3,710 మద్దతు ధర ఉండగా ఈ సారి రూ.170 పెరిగింది. రాష్ట్రంలో సోయా సాగు విస్తీర్ణం పెరగడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రత్యామ్నయంగా సోయా పంటను సాగు చేయడానికి రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. కందులకు రూ.200 మద్దతు ధర పెరిగింది. కందులకు గతంలో క్వింటాల్‌కు రూ.5,800 ఉండగా ఇప్పుడు రూ.ఆరు వేలు అయింది. అలాగే పెసర్లకు క్వింటాలుకు రూ.146 మద్దతు ధర పెంచారు. దీంతో క్వింటాలుకు రూ.7,196 ధర లభించనుంది. పెసర్లు దిగుబడి ఎక్కువగా లభించే అవకాశం లేదు. సోయాలో కందులను అంతర్‌ పంటగా సాగు చేయడంతో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్‌. కిషన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. 

మరిన్ని వార్తలు