తెలంగాణపై ఉపరితల ద్రోణి

6 Apr, 2019 20:32 IST|Sakshi

ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు

ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

సాక్షి, హైదరాబాద్‌: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరట్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. అలాగే సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. 

ఈదురుగాలుల కారణంగా అనేకచోట్ల మామిడి కాయలు పడిపోయే ప్రమాదం ఉందని ఉద్యానశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా శనివారం ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంలలో 41 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్‌లలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు