వాహనం నుంచే వాహనాలపై నిఘా

25 Nov, 2017 03:12 IST|Sakshi

ఇవాంకా భద్రతకు అత్యాధునిక పరిజ్ఞానం వినియోగం

సీక్రెట్‌ సర్వీస్‌ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎఫ్‌బీఐ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌) కోసం నగరానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఆ దేశ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌తో పాటు ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) వాడే బ్యాక్‌ స్కాటింగ్‌ పరిజ్ఞానంతో పని చేసే స్కానర్లను తమ వెంట తీసుకువచ్చారు. వీటిని ఇవాంకా క్యారికేడ్‌(కాన్వాయ్‌)లో ఉండే మూడు వాహనాల్లో ఒక దానిలో ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానం వినియోగిస్తే భద్రతాధికారులు చుట్టూ ఉన్న వాహనాల వద్దకు స్వయంగా వెళ్లి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉండదు.

ఎదుటి వాహనాల్లో ఉన్న ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు, కరెన్సీ, డ్రగ్స్, మందుగుండు సామగ్రి ఇలా దేన్నైనా స్కానింగ్‌లో కనిపెట్టడం సాధ్యమవుతుంది. బ్యాక్‌ స్కాటింగ్‌ పరిజ్ఞానం కలిగిన వాహనం ఎక్స్‌రే ఇమేజింగ్‌ పద్ధతి ద్వారా తన చుట్టూ ఉన్న వాహనాలు లేదా వస్తువులను క్షణాల్లో స్కాన్‌ చేస్తుంది. వాటిలోని అన్ని మూలల్నీ, ప్రతి కోణంలోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పైకి చూడ్డానికి కాన్వాయ్‌లోని సాధారణ వాహనంలా కనిపించే దాంట్లోనే ఈ పరిజ్ఞానం జోడించారు. దీంతో సదరు వాహనం ఉన్న ప్రాంతం నుంచి చుట్టూ గరిష్టంగా 100 మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలపై నిఘా పెట్టగలదు. దీని నిర్వహణ సైతం ఎంతో సులభం. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఒక ఆపరేటర్‌ సరిపోతారు.

సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లతో పాటు రానున్న ఎఫ్‌బీఐ అధికారులు దీన్ని పర్యవేక్షించనున్నారని తెలిసింది. ప్రమాదకర పరిస్థితులు, ప్రదేశాల్లో పని చేయాల్సి వచ్చినప్పుడు ఆపరేటర్‌ సైతం వాహనంలో లేకుండా దూరం నుంచి రిమోట్‌ ద్వారా కూడా ఈ స్కానింగ్‌ వ్యవస్థను నియంత్రించే అవకాశం ఉంది. ఈ వాహనం నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాలు చుట్టూ ఉన్న వాహనాలను స్కాన్‌ చేసి ఆ ఫొటోలను సేకరిస్తాయి. ఆ చిత్రాలు ఆపరేట్‌ వాహనంలో ఉన్న సిబ్బంది తమ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఎక్స్‌రే వ్యూలో చూస్తుంటారు. వీటిని జూమ్‌ చేసుకునే సదుపాయమూ ఉంటుంది. స్కాన్‌ చేసిన చిత్రాల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే.. వెంటనే భద్రతా దళాలను అప్రమత్తం చేయడానికి సమాచార వ్యవస్థ కూడా సదరు వాహనంలోనే ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు