కాంగ్రెస్‌ పార్టీ పీవీని మరిచిపోయింది: ఈటల 

23 Dec, 2023 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పీవీ ఘాట్‌ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో దేశానికి పీవీ చేసిన సేవలను ప్రశంసించారు. 

ఇక, పీవీ ఘాట్‌ వద్ద మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..‘తెలుగు వారికి, తెలంగాణకు, భారత దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహారావు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలు అందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్‌ను నిర్మించాలి. భారతరత్న ఇచ్చి పీవీని గౌరవించాలి. పీవీ విషయంలో కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్‌ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కూడా పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..‘దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. పీవీని కాంగ్రెస్‌ పార్టీ మరిచిపోయింది. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదన్న కేసీఆర్‌.. ఆయన వర్థంతి సభకు బీఆర్‌ఎస్‌ రాకపోవడం బాధాకరం’ అని విమర్శించారు. 

>
మరిన్ని వార్తలు