రండి.. స్వచ్ఛతలో మెరుగైన ర్యాంకు సాధిద్దాం

4 Jan, 2019 08:48 IST|Sakshi

నేటి నుంచి ఈనెల 31 వరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌

దేశవ్యాప్తంగా 4,379 నగరాల్లో సర్వే

నెలాఖరులోగా ఎప్పుడైనా నగరానికి ప్రతినిధి బృందం

సర్వేలో పాల్గొనండి.. మెరుగైన ర్యాంకుకు సహకరించండి

నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ విజ్ఞప్తి

సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019’లో నగరం ర్యాంకును ఎంపిక చేసేందుకు నేటి (4 జనవరి) నుంచి ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రతినిధులు నగరంలో పర్యటించనున్నందున జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమంపై శ్రద్ధ వహించింది. ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రతినిధులడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వాల్సిందిగా భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలకు సిద్ధమైంది. తొలి పది స్థానాల్లో ర్యాంకు పొందేందుకు గత మూడేళ్లుగా జీహెచ్‌ఎంసీ ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, ప్రజాభిప్రాయానికి సంబంధించిన విభాగంలో మార్కులు తగ్గుతుండటంతో అది ర్యాంకుపై ప్రభావం చూపుతోంది. దీంతో నగర వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కలిగి ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ విజ్ఞప్తి చేశారు. 

మంచి ర్యాంకు వల్ల ప్రయోజనాలెన్నో..
హైదరాబాద్‌ను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలపడానికి నగర పాలనా విభాగానికి సహకరించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉంది. హైదరాబాద్‌ నగరానికి ఉత్తమ ర్యాంక్‌ లభిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు అందే అవకాశం ఉంది. నగర నిర్వహణను ఆధునిక పద్దతుల్లో మరింత మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంటుంది. స్వచ్ఛత ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి పెరిగి తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

2018లో 27వ ర్యాంకు
2015లో 476నగరాల్లో మొదటి సారిగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌ నగరం 275స్థానాన్ని పొందింది. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ నగరం అనూహ్యంగా 19వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా చేపట్టిన పలు స్వచ్ఛ కార్యక్రమాల ఫలితంగా ఈ 19వ స్థానాన్ని పొందింది. 2017లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 434 నగరాల్లో జీహెచ్‌ఎంసీ 22వ స్థానంలోనూ, దేశంలోని మెట్రో నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌–2018లో 4,041 నగరాలు, పట్టణాలు పోటీ పడగా నగరానికి 27వ ర్యాంకు లభించింది. 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ను 4,379 నగరాల్లో నిర్వహించనున్నారు.  

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అంటే ఏమిటి?
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను 2014 అక్టోబర్‌ 2న భారత ప్రభుత్వం ప్రారంభించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణలో నగరవాసుల భాగస్వామ్యం చేయాలన్నదే ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. నగరాల్లోని పబ్లిక్‌ స్థలాలను మరింత పరిశుభ్రంగా ఉంచడానికి గాను చెత్తను ఉత్పత్తి స్థలాల్లోనే వేరు చేయడం, వ్యర్థాల రవాణ, తొలగింపు తదితర ప్రమాణాలతో నగరాలను మూల్యాంకనం చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అనే విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

స్వచ్ఛ ప్రశ్నలివే..
1. స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 సర్వేలో హైదరాబాద్‌ పాల్గొంటున్న విషయం మీకు తెలుసా?
2. మీ నగరం పరిశుభ్రతా స్థాయి మీకు సంతృప్తికరంగా ఉందా?
3. మీరు వ్యాపార మరియు పబ్లిక్‌ ఏరియాలలో చెత్త డబ్బాలను తేలికగా గుర్తుపడుతున్నారా ?
4. వ్యర్థాలను సేకరించే వ్యక్తి తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని మిమ్మల్ని కోరడం జరిగిందా?
5. మీ వద్ద సేకరించిన వ్యర్థ పదార్థాలు (చెత్త) డంపింగ్‌ యార్డుకు పారిశుధ్య స్థలానికి (ల్యాండ్‌ ఫిల్లింగ్‌ సైట్‌) లేదా ప్రాసెసింగ్‌ స్థలానికి వెళ్తాయని మీకు తెలుసా?
6. ప్రస్తుతం నగరంలోని మూత్రశాలలు/మరుగుదొడ్లు ప్రవేశానికి (వాడకానికి) వీలుగా, శుభ్రంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
7.  మీ నగరం ఓడీఎఫ్‌ (బహిరంగ మల, మూత్ర విసర్జన) స్థాయి గురించి మీకు తెలుసా?
వీటన్నింటికీ సానుకూల సమాధానమివ్వడం ద్వారా నగరం మంచిర్యాంకు సాధించేందుకు వీలుంటుంది.  
ఈ ఏడు ప్రశ్నలకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1969కు ఫోన్‌చేసి కానీ www.swachhsurvekshan2018.org కిగాని లేదా swachhata app ద్వారా గానీ తెలియచేసి హైదరాబాద్‌ నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు