'చీప్ లిక్కర్ తాగినా హాని ఉండదా..!

19 Aug, 2015 19:37 IST|Sakshi

రాయికల్ (కరీంనగర్ జిల్లా): రాష్ట్రంలో చీప్‌లిక్కర్ ను ప్రోత్సహించడంపై సీఎల్పీ ఉపనేత తాటిపత్రి జీవన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. 'దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తుంటే తెలంగాణలో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు.

'మద్యం బాటిళ్లపై మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక ఉంటుంది. దీన్ని గ్రహించని కేసీఆర్ మాత్రం చీప్‌లిక్కర్ తాగితే ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. గుడుంబాను నియంత్రించాలంటే చీప్‌లిక్కర్‌ను తాగాలని చెప్పడం సరికాదు. గీతకార్మికుల పొట్టకొట్టడం కోసమే సీఎం పన్నాగం చేస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖల సహకారంతో గుడుంబాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చీప్‌లిక్కర్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మహిళా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం' అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు