పశు వైద్య పట్టభద్రుల చర్చలు విఫలం

5 May, 2017 01:46 IST|Sakshi
పశు వైద్య పట్టభద్రుల చర్చలు విఫలం

ఈ నెల 25న మరోమారు మంత్రి తలసానితో భేటీ!
సాక్షి, హైదరాబాద్‌: తమ డిమాండ్ల సాధనకై 11 రోజులుగా సమ్మె చేస్తున్న పశువైద్య పట్టభద్రులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ(డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా చేపట్టాలని పశువైద్య పట్టభద్రులు డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలోని పశుసంపద కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్చాలని, వైద్య సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులు, నియామకానికి సంబంధించిన విధి విధానాలేమిటో తెలిపాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లును మంత్రి తలసాని ఆదేశించారు. అయితే, పశువైద్య పోస్టుల ఖాళీలు, నియామక ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సమస్యలను సమీకరించేందుకు గడువు కావాలని డైరెక్టర్‌ మంత్రిని కోరారు. దీంతో ఈ నెల 25లోగా వివరాలను సమర్పించాలని, తదుపరి చర్చల నిమిత్తం 25న మరోమారు భేటీ కావాలని మంత్రి నిర్ణయించారు. అయితే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము చేస్తున్న సమ్మెను కొనసాగించాలని పశువైద్య పట్టభద్రులు నిర్ణయించారు. మంత్రిని కలసిన వారిలో పశువైద్య పట్టభద్రులు కాటం శ్రీధర్, మౌనిక, అభిలాశ్, పురుషోత్తమ్‌ నాయక్‌ తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు