ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్‌!

29 Nov, 2023 08:13 IST|Sakshi

కోడ్‌తో సాధారణ పనులకే యంత్రాంగం పరిమితం 

తీరిక దొరికినప్పుడల్లా ఎన్నికల గెలుపోటములపై డిబేట్‌లు

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావ్‌? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఓటరు నాడి ఎలా ఉంది?’’  ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ వినిపించిన ప్రశ్నలివి. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తారసపడిన వ్యక్తులతో ఆసక్తిగా ప్రశ్నలడిగారు. వాటికి వస్తున్న జవాబులతో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ విశ్లేషణ వాతావరణం కనిపించింది.

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌తో  ప్రభుత్వ స్థాయిలో కొత్త కార్యక్రమాలేవీ లేవు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక, లబ్థి చేకూర్చే కార్యక్రమాలకు  బ్రేక్‌ పడింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు కాస్త విరామం దొరికినట్టయ్యింది. దీంతో ఆ కార్యాలయాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చోపచర్చలు జరిగాయి. ఉద్యోగులు కాకుండా ఇతరులెవరైనా కార్యాలయానికి వెళ్తే ‘‘ఎవరు గెలుస్తారంటావ్‌’’ అంటూ ఉద్యోగులు సరదాగా ఆసక్తికర చర్చ పెట్టారు.

ఉన్నతాధికారులు సైతం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి. వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌(అప్పట్లో టీఆర్‌ఎస్‌) అధికారం చేపట్టగా... ఇప్పుడు మూడోసారి కూడా గెలుపుపై అదే ధీమా వ్యక్తం చేస్తూ అందరి కంటే ముందుగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటరు నాడిని అంచనా వేస్తూ గత పదేళ్లలో జరిగిన సంక్షేమ పథకాలు, లబి్ధదారులు, ఓటరు నాడి తదితర విశ్లేషణతో గెలుపోటములు ఎలా ఉంటాయో ఊహాజనిత అంచనాలకు దిగారు. స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్న చర్చల్లో కొందరు ఉన్నతాధికారులు సైతం పాలుపంచుకుంటున్నారు. 

అప్పుడే బెట్టింగ్‌లు?  
చాలామంది ఉద్యోగులు, అధికారులు వారి సొంత నియోజకవర్గాలు, పనిచేసిన నియోజకవర్గాల్లో స్నేహితులను ఫోన్లలో అడిగి మరీ ఎన్నికల సరళిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరి కొందరు మరో పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ కొందరైతే ఏకంగా బెట్టింగులకు సైతం దిగారు.

ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్‌  

మరిన్ని వార్తలు