‘గోదావరి–కావేరి’ అనుసంధానించండి 

14 Dec, 2018 00:16 IST|Sakshi

కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న   తమిళనాడు 

మోదీ, గడ్కరీకి లేఖ రాసిన  ఎంపీ ఆర్‌.గోపాలకృష్ణన్‌  

దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరిన కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసేలా కేం ద్రంపై తమిళనాడు ఒత్తిడి పెంచుతోంది. లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవ స రాలను తీర్చేలా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన ప్రణాళికల ను అమల్లోకి తేవాలంటోంది. ఇందులో భాగంగా గోదావరి, కావేరి నదులను అనుసంధానించాలని కేంద్రాన్ని పట్టుబడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీలకు ఏఐడీఎంకే ఎంపీ ఆర్‌.గోపాల్‌కృష్ణన్‌ లేఖ రాశారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం అంశాన్ని ఎంఐడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కారణంగా దీనిపై వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలనాటికి ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.  

ద్వీపకల్ప నదుల పథకంలో భాగంగానే.. 
కేంద్రం ద్వీపకల్ప నదుల పథకంలో భాగంగా ఒడిశా లోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ని గోదావరి, కృష్ణా, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు ఈ నదుల అనుసంధానాన్ని చేపట్టింది. అదనపు నీటిలభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్నట్లుగా అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో 247 టీఎంసీల నీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం. గోదావరి నుంచి కృష్ణాకు 247 టీఎంసీలు తరలిస్తే, అటు నుంచి పెన్నాకు 143 టీఎంసీలు, పెన్నా నుంచి కావేరికి 88.83 టీఎంసీలు తరలించేలా కేం ద్రం ప్రణాళిక రూపొందించింది. అయితే, ఈ ప్రణాళికపై తెలంగాణసహా అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తుతుండటంతో మరోమారు కేంద్రం అధ్యయనం చేయిస్తోంది.  

పొరుగు రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం.. 
తక్కువ వర్షపాతం కల్గిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని, దీంతో నీటి కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని తమిళనాడు చెబుతోంది. గతం లో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం గోదావరి నుంచి కావేరికి 175 టీఎంసీల నీటిని తరలించాలని కోరు తోంది. ఆవిరి నష్టాలు 17.50 టీఎంసీలు, దారి పొడువునా చెరువులు నింపేందుకు మరో 57.50 టీఎంసీలు అవసరమవుతాయిని తమిళనాడు చెబుతోంది. ఇక 100 టీఎంసీలతో 4.01 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశం ఉందని ఎంపీ గోపాల్‌కృష్ణన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ అను సంధానంతో వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమల ద్వారా ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించే విషయంలో ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు తెలపాలని కేంద్రం కోరగా, దీనిపై తెలంగాణ తన వివరణను సిద్ధం చేసే పనిలో పడింది. దక్షిణాది నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదని, ముంపు సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఇదివరకే కేంద్రానికి తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇదే విషయాన్ని మరోమారు తెలిపే అవకాశం ఉంది.   
 

మరిన్ని వార్తలు