కరువు నేలకు కల్పతరువు

1 Oct, 2018 02:12 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలు జనగామ, సిద్దిపేట జిల్లాలకు తపాస్‌పల్లి రిజర్వాయర్‌ కల్పతరువుగా మారింది. ఈ జిల్లాల్లోని బీడు భూములకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తున్నారు.  

54 చెరువులకు ఆధారం.. 
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి ఏటా సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక మండలాల్లోని సుమారు 54 చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, మరో 1.2 టీఎంసీలను గోదావరి జలాలతో ఈ 5 మండలాల్లోని చెరువులకు తరలిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు తాగునీటి కోసం కొమురవెల్లిలోని 13 చెరువులు, చేర్యాలలో 8, మద్దూరులో 1, కొండపాకలో 7 చెరువులు, బచ్చన్నపేటలోని 25 చెరువులు నింపారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మరిన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో... 
సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలంటే ఎత్తిపోతలే మార్గం.. దీన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2007లో తపాస్‌పల్లి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్‌ హయాం తర్వాత పెద్దగా పనులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుల సహకారంతో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్‌ కింద 82,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.  

25 శాతం పనులు పెండింగ్‌లోనే... 
2007లో ప్రారంభించిన తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో ఇప్పటికీ 75 శాతం పనులే మాత్రమే పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 

కష్టాలు తీరాయి.. 
గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వా యర్‌ను నింపి, తద్వార చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో కరువు ప్రాంతమైన సాగుకు అనుకూలమైంది. ఏటా చెరువులు నింపడంతో వ్యవసాయం చేయడానికి నీళ్ల కష్టం తొలగిపోయింది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు.  
 – మెరుగు క్రిష్ణ , రైతు ఐనాపూరు

కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి  
రిజర్వాయర్‌ ఎడమ, కుడి కాల్వలు, ఉపకాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలి. మెయిన్‌ కాల్వలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీరందించాలి.  
 – చెరుకు రమణారెడ్డి, ఐనాపూర్‌

మరిన్ని వార్తలు