భూకేటాయింపులపై టాస్క్‌ఫోర్స్

6 Dec, 2014 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో దేవాలయ, వక్ఫ్, భూదాన బోర్డులకు చెందిన భూముల కేటాయింపులు, వాటి వినియోగంపై ఎప్పటికప్పుడు నివేదికలను అందించడానికి ప్రభుత్వం శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. గతంలో నిర్దిష్ట అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఏయే అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న అంశాన్ని పరిశీలించే ఈ టాస్క్‌ఫోర్స్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యాంకుమార్ సిన్హా చైర్మన్‌గా ఏర్పాటైంది.

భూ కేటాయింపులపై భారీగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం విధానం, భూ కేటాయింపు అవసరం, మార్గదర్శకాల మేరకు భూమిని వినియోగిస్తున్నారా? చట్టానికి లోబడి ఆ భూ వినియోగం జరుగుతున్నదా? అనే అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ లోతుగా అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ విధానాలు, చట్టానికి లోబడి భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, సీసీఎల్‌ఏకు అందిస్తుందని తెలిపింది. ఉత్తర్వుల ప్రకారం ఈ టాస్క్‌ఫోర్సు విధులు, అధికారాలు, జీతభత్యాలు, సౌకర్యాలు ఇలా ఉన్నాయి..
 
అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన భూముల కేటాయింపులు, బదిలీ, లీజు తీసుకున్న సంస్థలు ఏయే అవసరాలకు వినియోగిస్తున్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అనుభవదారులు ఎవరు అనే అంశాలపై నిర్దిష్టమైన రికార్డులతో డేటా బేస్‌ను రూపొందించాలి.
 
అన్ని భూ కేటాయింపుల కేసుల్లోనూ అతిక్రమణలు, ఉల్లంఘనలపై నిర్దిష్టమైన, స్పష్టమైన రికార్డులు తయారు చేయాలి.
 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని జాగీర్ భూముల రికార్డులు,  క్షేత్రస్థాయిలో కనిపించని భూముల జాబితా రూపొందించాలి.

హైదరాబాద్ పరిసరాల్లోని దేవాలయాల, వక్ఫ్, భూదాన భూముల పరిరక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు చేయాలి.

మరిన్ని వార్తలు