టీడీపీని తరిమే రోజులు దగ్గరలోనే..

4 Apr, 2014 03:33 IST|Sakshi
టీడీపీని తరిమే రోజులు దగ్గరలోనే..

నయీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ నుంచి టీడీపీని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు హెచ్చరించారు. హన్మకొండ రాంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదివేల మంది కూడా పట్టని హయగ్రీవాచారి మైదానంలో సభ జరిపి విజయవంతమైం దని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
 
చంద్రబాబునాయుడు గడీల పాలన అని వ్యాఖ్యానించి సీమాంధ్ర దురహంకారాన్ని బయట పెట్టుకున్నాడని మండిపడ్డారు. రాబోయేది గడీల రాజ్యం కాదని, ప్రజల రాజ్యం అని రవీందర్‌రావు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ రాజ్యాన్ని నడపలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను ఉప ప్రాంతీయ పార్టీ అని ఎద్దేవా చేస్తున్న బాబు.. ఉప ప్రాంతీయ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. టీడీపీకి దమ్ముంటే ఒక జెడ్పీటీసీ, ఒక మునిసిపల్ స్థానం గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
 
చంద్రబాబుకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే.. సీమాంధ్రలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చెప్పడం లేదన్నారు. తెలంగాణలో టీడీపీ మునిగిపోయే నావకావడంతో ఆర్.కృష్ణయ్యను నాయకుడిని చేస్తానని బాబు అంటున్నాడని విమర్శించారు. వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు మరోసారి తెలంగాణ ప్రజలను నమ్మించడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు.
 
బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆజంజాహి మిల్లును మూసి వేశాడని, ఎయిర్‌పోర్టుకు ఒక్క పైసా కేటాయించలేదని, దేవాదుల ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదని ఆయన విమర్శించారు.  అనేక మంది రైతుల ఆత్మహత్యలకు బాబు కారకుడయ్యాడని మండిపడ్డారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నయీమొద్దీన్, రమేష్, తీగల జయరాజ్, టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీరాం శ్యాం, సైదిరెడ్డి, బండి రజినీకుమార్, వేముల రమేష్, జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు