శుభ్రతపై నిర్లక్ష్యమేల?

8 Mar, 2019 11:37 IST|Sakshi

   పథకం అమలుపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్‌ (వాటర్‌ శానిటేషన్‌ హైజిన్‌) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి.

ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

 ఉపాధ్యాయుల బాధ్యత.. 
ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్‌ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్‌ విద్యా మిషన్‌ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది.  

నిరాశే మిగిలింది.. 
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్‌ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు.
 

అమలుపై దృష్టి సారిస్తాం 
ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్‌’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్‌పై సూచనలు అందిస్తున్నాం 
సంగీత, ఎంఈఓ, ధన్వాడ  

మరిన్ని వార్తలు