వీడుతున్న చిక్కుముళ్లు!

30 Jun, 2019 01:54 IST|Sakshi

విభజన సమస్యల పరిష్కారంపై ఇరురాష్ట్రాల సీఎస్‌ల మధ్య చర్చలు

సొంత రాష్ట్రానికి ఏపీలోని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు

ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీలో నిర్ణయం

ప్రగతి భవన్‌లో రెండోరోజు సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు

ఇరువురు సీఎంల అనుమతులు తీసుకున్నాక ఉత్తర్వులు జారీచేసే అవకాశం

వారంలోగా మరోసారి భేటీ కానున్న ఉన్నతాధికారుల బృందం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా నెలకొన్న చిక్కు ముడుల పరిష్కార ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగులతోపాటు, నిధులు, ఆస్తుల పంప కాలకు సంబంధించిన వివా దాలను సత్వరమే పరిష్కరిం చుకోవాలని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల బృందం నిర్ణయం తీసుకుంది. ప్రధా నంగా ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత నాలుగో తరగతి ఉద్యోగులను.. సొంత రాష్ట్రానికి కేటాయించే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ, రాష్ట్ర విభజన వ్యవహారాల ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, ఏపీ నుంచి ప్రభుత్వ సలహా దారు అజయ్‌ కల్లమ్, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానంగా విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగాయి.

తొమ్మిదవ షెడ్యూ ల్లోని 89 సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి ‘షీలా బిడే కమిటీ’ నివేదిక ఆధా రంగా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇం దులో కొన్ని సంస్థల్లో ఏపీకి, మరికొన్ని సంస్థల్లో తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నందున తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థ లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరి ష్కరించుకుందామని సమావేశంలో నిర్ణయిం చారు. దీనిపై తెలంగాణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీపై కూడా విస్తృతంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనల మేరకు సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు జరిగాయని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. విద్యుత్‌ ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చ సాగింది. భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఫలితం ఉండదని, పరిష్కారాలు కావాలని శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

విశాఖ లేదా తిరుపతిలో సీఎంల భేటీ!
రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు మరోసారి సమావేశమై సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ.. వారం, పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. జూలై 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలున్నందున ఆ లోగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విశాఖపట్టణం లేదా తిరుపతిలో సమావేశం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు